India A vs New Zealand A: భారత్ ‘A’, న్యూజిలాండ్ ‘A’ జట్ల మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి చివరకు డ్రాగా ముగిసింది. గెలుపు ముంగిట నిలిచిన భారత జట్టు ఒక్క వికెట్ తీయలేక విజయాన్ని చేజార్చుకుంది. ఆఖరి రోజు వెలుతురు లేకపోవడంతో పూర్తి ఓవర్ల ఆట సాధ్యపడలేదు. 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 65 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్ కర్టిస్ హీఫీ అజేయంగా 90 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆఖరి వికెట్‌కు జేడెన్ లెనాక్స్ (24 బంతుల్లో 6 పరుగులు) అతనికి పూర్తి సహకారం అందించాడు. 56వ ఓవర్లోనే 9వ వికెట్ పడగొట్టిన భారత్‌కు.. ఆ తర్వాత జరిగిన 9 ఓవర్లలో చివరి వికెట్ దక్కలేదు. వెలుతురు సరిగా లేకపోవడంతో పేస్ బౌలర్లు సైతం స్పిన్ బౌలింగ్ చేయాల్సి వచ్చింది. భారత్ అన్ని వ్యూహాలు ప్రయోగించినప్పటికీ ఫలితం దక్కలేదు.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 113 పరుగులకే కుప్పకూలడంతో జట్టుకు ఓటమి తప్పదు అనుకున్నారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ 199 పరుగుల అద్భుతమైన మారథాన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా అతను 199 పరుగుల వద్ద ఔటై తృటిలో డబుల్ సెంచరీని కోల్పోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు అద్భుతంగా పుంజుకుని 516 పరుగుల భారీ స్కోరు సాధించారు. పడిక్కల్‌తో పాటు సాయి సుదర్శన్ (91), యశ్ ఠాకూర్ (66), వాషింగ్టన్ సుందర్ (52) రాణించారు. ముఖ్యంగా మూడో వికెట్‌కు పడిక్కల్, సుదర్శన్ జోడీ నమోదు చేసిన 215 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌కే టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అయితే సీనియర్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యారు.

