NTV Telugu Site icon

IND vs AUS 2nd ODI: నేడు ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. శ్రేయస్‌కు ఇదే చివరి ఛాన్స్‌? తుది జట్టు ఇదే

India Team New

India Team New

India vs Australia 2nd ODI Playing 11: భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో మధ్యాహ్నం 1.30కి మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే మొదటి వన్డే గెలిచిన టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. వన్డే ప్రపంచకప్‌ 2023కు ముందు జరుగుతున్న చివరి సిరీస్‌ను సొంతం చేసుకొని.. మెగా ఈవెంట్‌లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగాలని భారత్‌ చూస్తోంది. మరోవైపు మొదటి వన్డేలో ఓడిన ఆసీస్ ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇరు జట్లలో స్టార్స్ ఉన్నారు కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

తొలి వన్డేలో రుతురాజ్‌ గైక్వాడ్, శుబ్‌మన్‌ గిల్, కేఎల్‌ రాహుల్, సూర్యకుమార్‌ యాదవ్‌ అర్ధ సెంచరీలు చేశారు. వీరు మరోసారి చెలరేగాలని భారత్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే బ్యాటింగ్‌ ఆర్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఆడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ ఫామ్ జట్టును ఆందోళన పెడుతోంది. మొదటి వన్డేలో తక్కువ స్కోరుకే వెనుదిరిగిన అయ్యర్‌.. రెండో వన్డేలో భారీ స్కోరు సాధిస్తేనే అతను ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో శ్రేయస్‌ ఊపందుకున్నాడంటే.. ప్రపంచకప్‌ ముంగిట భారత్‌కు పెద్ద భారం దిగిపోయినట్లే.

అక్షర్‌ పటేల్‌ గాయం నేపథ్యంలో జట్టులోకి వచ్చిన సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. తొలి వన్డేలో మోస్తరు ప్రదర్శన చేశాడు. 10 ఓవర్లలో 47 పరుగులిచ్చి.. ఒక వికెట్‌ తీశాడు. ప్రపంచకప్‌ 2023లో అవకాశం దక్కించుకోవాలంటే అశ్విన్‌ ఇంకా తన బెస్ట్ ఇవ్వాల్సిందే. రెండో వన్డేలో శ్రేయస్‌ అయ్యర్, ఆర్ అశ్విన్‌లపై అందరి దృష్టి నిలిచి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత సీనియర్‌ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ బంతితో చెలరేగాడు. తొలి వన్డే నుంచి విశ్రాంతి తీసుకున్న మొహ్మద్ సిరాజ్‌ను ఆడిస్తే.. జస్ప్రీత్ బుమ్రా రెండో వన్డే మ్యాచ్‌లో ఆడకపోవచ్చు. ఇక శార్దూల్‌ ఠాకూర్‌ ధారాళంగా పరుగులిచ్చి.. వికెట్‌ కూడా పడగొట్టలేకపోయాడు. అతను గాడిన పడకుంటే కష్టమే. శ్రేయస్‌, ఠాకూర్‌లకు చివరి అవకాశం అని చెప్పొచ్చు.

తొలి వన్డే ఓటమి తర్వాత ఆస్ట్రేలియా కసితో ఉంది. పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగిన కంగారూలకు.. కీలక ఆటగాళ్లు లేని భారత్‌ చేతిలో ఓడిపోవడమంటే పెద్ద పరాభవమే. పేసర్లకు అనుకూలించే మొహాలి పిచ్‌పై ఆసీస్ బౌలర్లు పెద్దగా రాయించలేకపోయారు. ఇక స్పిన్‌కు సహకరించే ఇండోర్‌లో ఆసీస్‌ ఏం చేస్తుందో చూడాలి. స్టీవ్ స్మిత్‌, డేవిడ్ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ లాంటి సీనియర్ల నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. జోష్ హేజిల్‌వుడ్‌ అందుబాటులోకి రానుండటంతో పేస్‌ బలం పెరగొచ్చు. బౌలింగ్‌లో ఆడమ్ జంపా నుంచి భారత బ్యాటర్లకు ముప్పు తప్పదు.

Also Read: Vande Bharat Train: విజయవాడ నుంచీ చెన్నైకి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. వర్చువల్ గా ప్రారంభించనున్న మోడీ

తుది జట్లు (అంచనా):
భారత్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌, శుబ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్, కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), ఆర్ జడేజా, వాషింగ్టన్‌ సుందర్, ఆర్ అశ్విన్, శార్దుల్‌ ఠాకూర్, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్‌/జస్ప్రీత్ బుమ్రా.
ఆ్రస్టేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్‌ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్‌ గ్రీన్, అలెక్స్‌ క్యారీ, జోస్‌ ఇన్‌గ్లిస్‌/ఆరోన్‌ హార్డీ, పాట్ కమిన్స్‌ (కెప్టెన్‌), సీన్‌ అబాట్, ఆడమ్‌ జంపా, జోష్ హాజల్‌వుడ్‌.