Most Wins in International T20Is: భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో విజయానంతరం ఈ రికార్డు నెలకొల్పింది. ఈ విజయంతో టీ20 ఫార్మాట్‌లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా భారత్ చరిత్రకెక్కింది. టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు 230 మ్యాచ్‌లు ఆడిన భారత్.. 150 మ్యాచ్‌ల్లో గెలుపొంది అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన రెండో జట్టుగా పాకిస్థాన్ ఉంది. పాక్ 245 మ్యాచ్‌ల్లో 142 విజయాలు అందుకుంది. ఈ జాబితాలో న్యూజిలాండ్ 220 మ్యాచ్‌ల్లో 111 విజయాలు, ఆస్ట్రేలియా 195 మ్యాచ్‌ల్లో 105 విజయాలు, దక్షిణాఫ్రికా 185 మ్యాచ్‌లో 104 విజయాలు సాదించి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మూడో టీ20లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ (66; 49 బంతుల్లో 7×4, 3×6), రుతురాజ్ గైక్వాడ్ (49; 28 బంతుల్లో 4×4, 3×6), యశస్వి జైస్వాల్ (36; 27 బంతుల్లో 4×4, 2×6) రాణించడంతో ముందుగా భారత్ 4 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ఛేదనలో జింబాబ్వే 6 వికెట్లకు 159 పరుగులే ఓడింది. మైయర్స్ (65 నాటౌట్, 49 బంతుల్లో 7×4, 1×6) టాప్ స్కోరర్. వాషింగ్టన్ సుందర్ (3/15), అవేష్ ఖాన్ (2/39) జింబాబ్వేను కట్టడి చేశారు.