NTV Telugu Site icon

IND vs NZ: జట్టును సోషల్‌ మీడియా ఎంపిక చేయదు.. గంభీర్‌ కీలక వ్యాఖ్యలు!

Gautam Gambhir

Gautam Gambhir

బెంగళూరులో న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైన బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో బాగా ఆడారు. కానీ సీనియర్‌ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఒక్కడే దారుణంగా విఫలమయి.. జట్టులో తన స్థానాన్ని ప్రమాదంలో నెట్టేసుకున్నాడు. రాహుల్ జట్టులో ఎందుకు అంటూ.. సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. సర్ఫరాజ్‌ ఖాన్‌ సెంచరీ చేయడంతో రాహుల్‌కు రెండో టెస్టుల్లో అవకాశం కష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్‌ అతడికి మద్దతుగా నిలిచాడు.

తుది జట్టును ఎంపిక చేసేది సోషల్‌ మీడియా కాదని, టీమ్‌ మేనేజ్‌మెంట్ ఏం ఆలోచిస్తుందనేది కీలకం అని గౌతమ్ గంభీర్‌ అన్నాడు. ‘సోషల్‌ మీడియాను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భారత తుది జట్టును ఎంపిక చేసేది సోషల్‌ మీడియా కాదు. టీమ్‌ మేనేజ్‌మెంట్ ఏం ఆలోచిస్తుందనేదే కీలకం. కేఎల్ రాహుల్ బాగా ఆడతాడు. కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌పై మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో కొందరు బ్యాటర్లు ఇబ్బందిపడినా.. అతడు హాఫ్ సెంచరీ చేశాడు. రాహుల్ సత్తా ఏంటో మాకు తెలుసు. భారీ ఇన్నింగ్స్ ఆడుతాడనే నమ్మకం ఉంది. అందుకే అతడికి మద్దతుగా ఉన్నాం. మేనేజ్‌మెంట్ ప్రతిఒక్కరినీ గమనిస్తూనే ఉంటుంది’ అని గౌతీ తెలిపాడు.

Also Read: KL Rahul-IPL 2025: పాపం కేఎల్‌ రాహుల్‌.. లక్నో రిటైన్ లిస్ట్‌ ఇదే!

రెండో టెస్టు కోసం భారత ఆటగాళ్లు ఇప్పటికే పూణే చేరుకున్నారు. గురువారం నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. కేఎల్ రాహుల్ సాధనలో కఠినంగా శ్రమిస్తున్నాడు. ప్రాక్టీస్‌ సెషన్‌కు సర్ఫరాజ్ ఖాన్‌ గైర్హాజరయ్యాడు. కుమారుడు జన్మించడంతో అతడు రెండో టెస్టుకు అందుబాటులో ఉండటం అనుమానమే. ఇదే జరిగితే గిల్ వచ్చినా.. రాహుల్ తుది జట్టులో ఉంటాడు. అయితే జట్టులో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో సర్ఫరాజ్ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని.. ఆడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.