NTV Telugu Site icon

Varun Chakravarthy: ఈడెన్‌లో అంత ఈజీ కాదు.. నా బౌలింగ్‌కు రేటింగ్ 7/10!

Varun Chakravarthy

Varun Chakravarthy

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జోస్ బట్లర్ వంటి డేంజరస్ బ్యాటర్‌కు బౌలింగ్‌ చేయడం అంత ఈజీ కాదని స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి పేర్కొన్నాడు. కేవలం స్పిన్‌తోనే ఇంగ్లీష్ బ్యాటర్లను ఆపలేమని, బౌన్స్‌తో బంతిని వేసి కట్టడి చేశామన్నాడు. తన బౌలింగ్‌కు 10కి 7 రేటింగ్‌ ఇచ్చుకుంటా అని, తాను ఇంకా మెరుగవ్వాల్సి ఉందని వరుణ్‌ చక్రవర్తి చెప్పుకొచ్చాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు తీసి 23 పరుగులు ఇచ్చిన చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న అనంతరం వరుణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ… ‘చాలా సంతోషంగా ఉంది. ఐపీఎల్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాను. ఈ పిచ్ సీమర్లకు సహకరిస్తుందని నాకు తెలుసు. అయితే లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులతో స్పిన్నర్లూ వికెట్లు తీయొచ్చు. ఇంగ్లండ్ బ్యాటర్లకు దూరంగా బంతులేయకుండా.. వికెట్లే లక్ష్యంగా విసిరాం. అందువల్లే వారిని కట్టడి చేయగలిగాం. ఈడెన్‌లో ప్రతి ఓవర్‌ సవాల్‌తో కూడుకున్నదే. ఇక్కడ బౌలింగ్ చేయడం అంత సులువు కాదు. ముఖ్యంగా జోస్ బట్లర్ వంటి డేంజరస్ బ్యాటర్‌కు బౌలింగ్‌ చేయడం తేలిక కాదు. కేవలం స్పిన్‌తోనే ఇంగ్లండ్ బ్యాటర్లను ఆపలేమని తెలుసుకున్నా. అందుకే బౌన్స్‌తో బంతిని వేశాను. నా బౌలింగ్‌కు 10కి 7 రేటింగ్‌ ఇచ్చుకుంటా. నేను మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉంది’ అని చెప్పాడు.

Also Read: Abhishek Sharma: రెండో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ అరుదైన రికార్డు!

వరుణ్‌ చక్రవర్తి ఇప్పటివరకు భారత్ తరఫున 14 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 366 పరుగులు ఇచ్చి 22 వికెట్స్ పడగొట్టాడు. ఐపీఎల్‌లో 71 మ్యాచ్‌లలో 83 వికెట్స్ తీశాడు. ఐపీఎల్ ప్రదర్శనతోనే చక్రవర్తి భారత జట్టులోకి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. జోస్‌ బట్లర్‌ (68; 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అభిషేక్ శర్మ (79; 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) దంచికొట్టాడు.