NTV Telugu Site icon

Rohit Sharma: రాహుల్ ద్రవిడ్‌ను వెనక్కినెట్టి.. గేల్ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్!

Rohit Sharma Sixes Record

Rohit Sharma Sixes Record

గత కొంతకాలంగా విఫలమవుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ ఫామ్‌లోకి వచ్చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ సెంచరీ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాదాడు. 30 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన రోహిత్.. 76 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. చాలా నెలల తర్వాత హిట్‌మ్యాన్‌ శతకం బాదడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కీలక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముంగిట హిట్‌మ్యాన్ ఫామ్ అందుకోవడం భారత జట్టుకు శుభపరిణామం.

ఈ సెంచరీతో వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌ శర్మ టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టె రాహుల్ ద్రవిడ్‌ను హిట్‌మ్యాన్‌ వెనక్కినెట్టాడు. ద్రవిడ్‌ 318 ఇన్నింగ్స్‌లలో 10,889 పరుగులు చేయగా.. రోహిత్ 259 ఇన్నింగ్స్‌లలో 10,964 రన్స్ చేశాడు. ప్రస్తుతం వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్స్ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (18,426), విరాట్ కోహ్లీ (13,906), సౌరవ్ గంగూలీ (11,363) హిట్‌మ్యాన్‌ కంటే ముందున్నారు.

రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఏడు సిక్సర్లు బాదాడు. దీంతో వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు (338) బాదిన రెండో బ్యాటర్‌గా హిట్‌మ్యాన్‌ నిలిచాడు. రెండో వన్డేకు ముందు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (331)తో సంయుక్తంగా రోహిత్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఏడు సిక్సర్లతో గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (351) అగ్రస్థానంలో ఉన్నాడు. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది. మెగా టోర్నీలో అఫ్రిది రికార్డును రోహిత్‌ బ్రేక్ చేసే అవకాశం ఉంది.