NTV Telugu Site icon

IND vs ENG: భారత గడ్డపై ఇంగ్లండ్‌ గెలవాలంటే.. ముందుగా అతడిని ఆపాల్సిందే!

Teamindia Test

Teamindia Test

Monty Panesar Hails Rohit Sharma Ahead of IND vs ENG Test Series: త్వరలో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. జనవరి 25న హైదరాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇటీవల కాలంలో బజ్ బాల్ అంటూ టెస్టు క్రికెట్‌లో దుమ్మురేపుతున్న ఇంగ్లండ్‌ను రోహిత్ సేన ఏ విధంగా ఆపుతుందో చూడాలి. అయితే టెస్టుల్లో భారత్‌కు సొంత గడ్డపై అద్భుత రికార్డు ఉంది. 2013 నుంచి భారత గడ్డపై 46 టెస్టులు ఆడిన టీమిండియా.. కేవలం మూడింటిలో మాత్రమే ఓడిపోయింది. ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా పర్యాటక జట్టుకు అప్పగించలేదు.

భారత్, ఇంగ్లండ్‌ సిరీస్‌కు ముందు ఇంగ్లీష్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు. స్పిన్‌ను రోహిత్ బాగా ఎదుర్కొంటాడని, ఇంగ్లండ్ విజయం సాధించాలంటే హిట్‌మ్యాన్‌ను ఆపాల్సిందే అని సూచించాడు. హిందూస్తాన్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనేసర్ మాట్లాడుతూ… ‘భారత్‌కు కీలకమైన ఆటగాడు రోహిత్ శర్మ. అతను టర్నింగ్ పిచ్‌లలో డాన్ బ్రాడ్‌మాన్‌లా ఆడతాడు. అతని రికార్డు నమ్మశక్యం కానిది. ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో విజయం సాధించాలంటే రోహిత్‌ను ముందుగానే ఔట్ చేయాలి’ అని అన్నాడు.

‘ఇంగ్లండ్ బౌలర్లు రోహిత్‌ శర్మను త్వరగా పెవిలియన్ చేర్చితే.. భారత్ ప్లాన్-బికి వెళుతుంది. అప్పుడు భారత యువ బ్యాటర్‌లను ఒత్తిడిలోకి నెట్టొచ్చు. ఇది టెస్టు సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంగ్లండ్ జట్టు దీనిపై దృష్టి పెట్టాలి’ అని మాంటీ పనేసర్ అన్నారు. ‘ఆర్ అశ్విన్ విభిన్న బంతుల్ని సంధించేలా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అతడు బౌలింగ్‌లో రోజురోజుకూ పదును పెరుగుతోంది. టర్నింగ్ పిచ్‌పై వికెట్లు సాధించడం అంత ఈజీ కాదు. కానీ అశ్విన్ పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతాడు. అశ్విన్ ఒక యాప్ లాంటి వాడు, ప్రతి ఆరు నెలలకు అప్‌డేట్ అవుతాడు. అందుకే కెరీర్‌లో రాణిస్తున్నాడు. యాష్ ఓ అద్భుతమైన బౌలర్. అతడితో జాగ్రత్త’ అని పనేసర్ హెచ్చరించాడు.

Also Read: Guntur Kaaram: ‘మావా ఎంతైనా పర్లేదు బిల్లు.. మనసు బాలేదు ఏసేస్తా బిల్లు’ సాంగ్ రిలీజ్!

2012/13లో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్‌కు గ్రేమ్ స్వాన్, మాంటీ పనేసర్ అద్భుత విజయాలు అందించారు. స్వాన్ నాలుగు టెస్టుల్లో 20 వికెట్లు పడగొట్టగా.. పనేసర్ 17 వికెట్లను మూడు గేమ్‌ల్లోనే తీశాడు. దాంతో అలిస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లీష్ జట్టు 2-1తో సిరీస్ గెలుచుకుంది. ఆ తర్వాత ఏ జట్టు కూడా భారత్‌లో టెస్టు సిరీస్ గెలవలేదు.