Ravichandran Ashwin return to IND vs ENG Rajkot Test: టీమిండియా అభిమానులకు శుభవార్త. వ్యక్తిగత కారణాలతో రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ మధ్యలో జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చేస్తున్నాడు. ఆదివారం నుంచి యాష్ జట్టుకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. అశ్విన్ తిరిగి నేడు జట్టుతో కలవనున్నాడు, మేనేజ్‌మెంట్ అతడికి మైదానంలోకి పునఃస్వాగతం పలుకుతోంది అని బీసీసీఐ పేర్కొంది.
‘కుటుంబంలో అత్యవసర పరిస్థితి కారణంగా రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్‌లో విరామం తీసుకొన్న అశ్విన్ తిరిగి నేడు జట్టుతో కలుస్తాడు. ఈ విషయాన్ని చెప్పేందుకు మేం చాలా సంతోషిస్తున్నాం. మ్యాచ్ రెండో రోజు అత్యవసర పరిస్థితుల కారణంగా యాష్ జట్టును వీడిన విషయం తెలిసిందే. అశ్విన్ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని.. టీమ్ మేనేజ్మెంట్, ప్లేయర్స్, మీడియా, ఫాన్స్ అండగా నిలిచారు. ఈ కష్ట సమయంలో సహచరులు అతడికి సమష్టిగా మద్దతు ఇచ్చారు. అశ్విన్‌కు మేనేజ్‌మెంట్ మైదానంలోకి పునఃస్వాగతం పలుకుతోంది’ అని ఒక ప్రకటనలో బీసీసీఐ పేర్కొంది.
Also Read: Geetha Madhuri: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్ గీతా మాధురి!
రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత అందుకున్న విషయం తెలిసిందే. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. దాంతో టెస్టు క్రికెట్ చరిత్రలో 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా యాష్ అరుదైన ఘనత సాదించాడు. ఈ ఫీట్ సాధించిన కొన్ని గంటలకే అతడు జట్టుకు దూరమయ్యాడు. కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా మూడో టెస్టు నుంచి అర్ధంతరంగా వైదొలిగాడు. తల్లి అనారోగ్య సమస్య కారణంగా చెన్నైకి వెళ్లిన అశ్విన్.. ఈరోజు లంచ్ విరామం సమయాని జట్టుతో కలవనున్నాడు.