టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. తన 50 వన్డే మ్యాచ్‌లో గిల్ ఈ మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ హషీమ్ ఆమ్లా (53 ఇన్నింగ్స్‌ల్లో) రికార్డును బద్దలు కొట్టాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో గిల్ 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సులతో 112 రన్స్ బాదాడు.
2019 జనవరి 31న హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున శుభ్‌మన్ గిల్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో బుధవారం ఇంగ్లండ్‌తో భారత్ తరఫున తన 50వ వన్డే మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో 2500 పరుగులు పూర్తి చేసేందుకు గిల్‌కు మూడో వన్డేలో 25 పరుగులు అవసరం కాగా.. గస్ అట్కిన్సన్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్ ఐదవ బంతికి బౌండరీ బాది అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. నాగ్‌పుర్‌లో 87, కటక్‌లో 60 రన్స్ బాదిన గిల్.. అహ్మదాబాద్‌లో ఏకంగా శతకం బాదాడు. మూడు మ్యాచులలో విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసిన గిల్.. జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. పేసర్లపైనా, స్పిన్నర్లపైనా ఎదురుదాడికి దిగిన గిల్ అద్భుత షాట్లతో అలరించాడు. తనకు అచ్చొచ్చిన నరేంద్ర మోడీ స్టేడియంలో అన్ని ఫార్మాట్లలోనూ గిల్ సెంచరీలు బాదాడు. ఈ మైదానంలో ఒక్కో ఫార్మాట్లో ఒక్కో శతకం సాధించిన గిల్.. ఐపీఎల్‌లోనూ సెంచరీ బాదాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నేపథ్యంలో గిల్ ఫామ్ టీమిండియాకు కలిసొచ్చే అంశమే.