Site icon NTV Telugu

IND vs AUS Semi-Final: నేడు టీమిండియాకు కఠిన సవాల్‌.. కంగారూలను దాటితే కప్పే!

Ind Vs Aus Semi Final

Ind Vs Aus Semi Final

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మధ్యాహ్నం 3 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఓటమే ఎరుగని జట్టు ఆసీస్ ఒక్కటే. సెమీస్‌లోనూ ఫేవరెట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటుతున్న ఆసీస్.. అదే ఊపులో ఫైనల్ చేరాలని చూస్తోంది. మోస్తరు ప్రదర్శనతోనే సెమీస్‌ బెర్తు సాధించిన భారత్.. సెమీస్‌లో విజయం సాధించాలంటే మాత్రం అత్యుత్తమంగా ఆడాల్సిందే. నేడు టీమిండియాకు కఠిన సవాల్‌ అనే చెప్పాలి. ఆసీస్ గండం దాటితే కప్ కొట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి.

ఓపెనర్ ప్రతీక రావల్‌ గాయంతో టోర్నీకి దూరం కావడం టీమిండియాకు ప్రతికూలతే. అయితే డాషింగ్‌ ఓపెనర్‌ షెఫాలి వర్మ జట్టులోకి రావడం సంతోషించాల్సిన విషయం. షెఫాలి మంచి ఆరంభాన్ని ఇస్తే భారీ స్కోర్ చేయొచ్చు. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ గాడిన పడాల్సి ఉంది. కీలక సెమీస్‌లో హర్మన్‌ చెలరేగుతుందని జట్టు ఆశిస్తోంది. రేణుక సింగ్, అమన్‌జ్యోత్, క్రాంతి గౌడ్‌లతో పేస్‌ విభాగమూ పటిష్టంగా ఉంది. దీప్తి శర్మ, శ్రీ చరణితో పాటు రాధ యాదవ్‌ స్పిన్ తిప్పితే తిరుగుండదు. స్పిన్‌కు సహకరించే డీవై పాటిల్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాను ఈ ముగ్గరు కట్టడి చేస్తే విజయానికి చేరువకావొచ్చు.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ అన్ని విభాగాల్లో ఆస్ట్రేలియాకు తిరుగు లేదు. ఓపెనర్లు అలీసా హీలీ, ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ చెలరేగుతున్నారు. ఎలీస్‌ పెర్రీ, బెత్‌ మూనీ, ఆష్లీ గార్డ్‌నర్, అనాబెల్‌ సదర్లాండ్‌ ఫామ్‌లో ఉన్నారు. అనాబెల్‌ నిలకడగా రాణిస్తోంది. తాలియా మెక్‌గ్రాత్‌ కూడా ఫామ్‌ అందుకుంటే కంగారులను తిరుగుండదు. మెగాన్‌ షట్, కిమ్‌ గార్త్‌, అలానా కింగ్, సోఫీ మోలనూలతో బౌలింగ్ విభాగం బాగుంది. ఆసీస్ జట్టులో ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గత లీగ్ మ్యాచులో ఇదే నిజమైంది. గెలిచే మ్యాచును భారత్ ఓడిపోయింది. ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు 60 వన్డేలు ఆడింది. ఇందులో 11 మ్యాచ్‌లే గెలిచి.. ఏకంగా 49 ఓడింది.

Also Read: PKL 2025-Telugu Titans: టైటాన్స్‌ ఆటకు తెర.. క్వాలిఫయర్‌-2లో అక్కడే వెనకపడిపోయింది!

భారత్, ఆస్ట్రేలియా సెమీస్‌ మ్యాచ్ జరిగే డీవై పాటిల్‌ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలం. స్పిన్నర్లకే ఇక్కడ సహకారం దక్కుతుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన లీగా మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు చెలరేగారు. సెమీస్‌ మ్యాచ్‌కూ వర్షం ముప్పుంది. అయితే పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. సెమీస్‌ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉన్న విషయం తెలిసిందే.

తుది జట్లు (అంచనా):
భారత్‌: స్మృతి మంధాన, షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), రిచా ఘోష్, దీప్తి శర్మ, అమన్‌జ్యోత్, స్నేహ్‌ రాణా, రాధ యాదవ్, శ్రీ చరణి, రేణుక సింగ్‌.
ఆస్ట్రేలియా: అలీసా హీలీ (కెప్టెన్‌), ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్, ఎలీస్‌ పెర్రీ, బెత్‌ మూనీ, అనాబెల్‌ సదర్లాండ్, ఆష్లీ గార్డ్‌నర్, తాలియా మెక్‌గ్రాత్, సోఫీ మోలనూ, అలానా కింగ్, కిమ్‌ గార్త్, మెగాన్‌ షట్‌.

 

 

 

Exit mobile version