బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ నెమ్మదిగా ఆడడం తనకు ఇష్టం లేదని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ అన్నాడు. రోహిత్ తన సోదరుడు అని.. అతను గొప్ప శక్తి, సంకల్పంతో ఆడాలని కోరుకుంటున్నా అని చెప్పాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. పెర్త్ టెస్ట్ ఆడని రోహిత్.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన హిట్‌మ్యాన్.. ఆరో స్థానంలో రాణించడం లేదు. నిజానికి అతడు ఆరో స్థానంలోనే టెస్ట్ అరంగేట్రం చేశాడు.
ప్రస్తుతం గబ్బాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. యశస్వి జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లీ (3), రిషబ్ పంత్ (9) ఘోరంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ కూడా 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ ట్రోఫీలో హిట్‌మ్యాన్ ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. తన శైలిలో కాకుండా.. నెమ్మదిగా ఆడుతూ వికెట్ సమర్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే రోహిత్‌కు మాథ్యూ హేడెన్ కీలక సూచన చేశాడు. హిట్‌మ్యాన్ మరింత శక్తితో దూకుడుగా ఆడాలని సూచించాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలన్నాడు.
స్టార్ స్పోర్ట్స్‌తో మాథ్యూ హేడెన్ మాట్లాడుతూ… ‘రోహిత్ శర్మ స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు చేస్తాడు. వన్డే క్రికెట్‌లో అతడు బాదిన డబుల్ సెంచరీలు, టీ20 ఫార్మాట్‌లో నెలకొల్పిన రికార్డులే ఇందుకు నిదర్శనం. అయితే ఈ మధ్యకాలంలో హిట్‌మ్యాన్ బాగా ఆడలేదు. చాలాగ్యాప్ తర్వాత ఆస్ట్రేలియాలో ఆడుతుండటంతో అడిలైడ్ టెస్టులో నెమ్మదిగా ఆడాడని బావించాడనుకుంటున్నా. ఇప్పుడు రోహిత్ తన కోసమైనా మరింత శక్తితో దూకుడుగా ఆడాలి. నేను అతని బ్యాటింగ్ పార్ట్‌నర్ అయితే.. నువ్వు నెమ్మదిగా ఆడటం నాకు ఇష్టం లేదని చెబుతా. రోహిత్ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా. హిట్‌మ్యాన్ నా సోదరుడు. రోహిత్ గొప్ప శక్తి, సంకల్పంతో ఆడాలని కోరుకుంటున్నా’ అని చెప్పాడు.