India vs Australia Playing 11 and Pitch Report: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు గువాహటిలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న యువ భారత్.. ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కచ్చితంగా గెలవాల్సి ఉంది. పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతున్న ఆసీస్.. యువ భారత్ చేతిలో ఓడిపోవడంను జీర్ణించుకోలేకపోతోంది. మూడో టీ20 మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది.
భారత్ బ్యాటర్లు జోరుమీదున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడు జట్టుకు కలిసొచ్చే అంశం. రెండో టీ20లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్.. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ కూడా హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖర్లో రింకు సింగ్ ఫినిషర్‌గా సత్తా చాటుకోవడం సంతోషాన్నిచ్చే విషయం. అయితే తెలుగు ఆటగాడు తిలక్ వర్మ నిరాశపరుస్తున్నాడు. తొలి రెండు టీ20ల్లో 12 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. సత్తా నిరూపించుకోవడానికి ఈ సిరీస్‌లో తిలక్‌కు ఇదే చివరి అవకాశం కావొచ్చు. చివరి రెండు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వస్తాడు. అప్పుడు తిలక్ చోటు కోల్పోయేందుకు ఆస్కారముంది. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం అవసరం. స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ బాగా బౌలింగ్ చేస్తున్నారు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది. ఓపెనర్లు స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్ శుభారంభం ఇవ్వాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. మ్యాక్స్‌వెల్ దూకుడుగా ఆడాలని కోరుకుంటోంది. స్టాయినిస్, టిమ్ డేవిడ్ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. బౌలర్ల ప్రదర్శన మెరుగుపడాల్సి ఉంది. రెండో టీ20లో ధారాళంగా పరుగులిచ్చిన అబాట్ స్థానంలో బెరెన్‌డార్ఫ్ తుది జట్టులోకి రావచ్చు.
గువాహటిలో ఇప్పటివరకు మూడు టీ20 మ్యాచ్‌లు జరిగాయి. అందులో భారత్, శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బౌలింగ్ అనుకూల పిచ్‌పై బెరెన్‌డార్ఫ్ చెలరేగడంతో 2017లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయిదేళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 16 పరుగుల తేడాతో గెలిచింది. ఇక మూడో టీ20కి వర్షం ముప్పు లేదు. కానీ మంచు ప్రభావం ఉండే అవకాశముంది.
తుది జట్లు (అంచనా):
భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముకేశ్ కుమార్.
ఆస్ట్రేలియా: స్మిత్, మాథ్యూ షార్ట్, ఇంగ్లిస్, మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, ఆడమ్ జంపా, నాథన్ ఎలిస్, బెరెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా.