Site icon NTV Telugu

IND vs AUS: ‘ఆరే’సిన స్టార్క్‌.. 180కి భారత్‌ ఆలౌట్‌! టాప్ స్కోరర్ మనోడే

Mitchell Starc 6 Wickets

Mitchell Starc 6 Wickets

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్స్ పడగొట్టడంతో భారత్ 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. తెలుగు ఆటగాడు నితీశ్‌ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్. 54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 42 రన్స్ చేశాడు. కేఎల్‌ రాహుల్‌ (37), శుభ్‌మన్‌ గిల్‌ (31) పరుగులు చేశారు. స్టార్క్ ‘ఆరే’యగా.. స్కాట్ బోలాండ్‌, ప్యాట్ కమిన్స్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

గులాబీ టెస్టులో టాస్‌ నెగ్గిన బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ గోల్డెన్ డక్‌ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31) జట్టును ఆదుకున్నారు. ఇద్దరు రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్, గిల్ వేగంగా పరుగులు చేస్తున్న సమయంలో స్టార్క్‌ మరోసారి బౌలింగ్‌కు వచ్చి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. ముందుగా కేఎల్‌ను ఔట్ చేసిన స్టార్క్.. ఆ తర్వాత విరాట్‌ కోహ్లీ (7)ని వెనక్కి పంపాడు. బోలాండ్‌ బౌలింగ్‌లో గిల్ ఎల్బీగా అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ (3) నిరాశపర్చగా. రిషబ్ పంత్ (21) కీలక సమయంలో అవుట్ అయ్యాడు. ఆర్ అశ్విన్ (22) పర్వాలేదనిపించాడు. ఓవైపు వికెట్స్ పడుతున్నా.. నితీశ్‌ రెడ్డి ధాటిగా ఆడడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది.

Exit mobile version