NTV Telugu Site icon

IND vs AUS: నేడు ఆస్ట్రేలియాతో భారత్‌ రెండో టీ20.. మ్యాచ్‌కు వర్షం ముప్పు!

India Vs Australia 2nd T20

India Vs Australia 2nd T20

India vs Australia 2nd T20 Weather Forecast: ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా నేడు తిరువనంతపురంలో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో మ్యాచ్‌ జరగనుంది. విశాఖపట్నంలో 200 లకు పైగా లక్ష్యాన్ని ఛేదించి ఆస్ట్రేలియాకు షాకిచ్చిన యువ భారత్.. ఇదే ఊపులో ఇంకో మ్యాచ్‌ గెలిచేయాలని చూస్తోంది. మొదటి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటింగ్‌ అంచనాలను మించిపోయినా.. బౌలింగ్‌ మాత్రం తేలిపోయింది. దాంతో రెండో టీ20లో బౌలర్లు పుంజుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు రెండో టీ20లో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆసీస్ భావిస్తోంది.

తొలి టీ20లో ఆడిన జట్టునే రెండో టీ20లో భారత్ కొనసాగించే అవకాశాలున్నాయి. తొలి టీ20లో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టును ముందుండి నడిపించాడు. ఇషాన్‌ కిషన్‌, యశస్వి జైస్వాల్‌, రింకు సింగ్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడారు. అందరూ ఇదే జోరును కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. విశాఖలో నిరాశపరిచిన రుతురాజ్‌ గైక్వాడ్‌, తిలక్‌ వర్మలు గాడిన పడాల్సి ఉంది. విశాఖలో బౌలర్ల ప్రదర్శన జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్, ప్రసిద్ధ్‌ కృష్ణ భారీగా పరుగులు ఇచ్చారు. స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ అయితే ఓవర్‌కు 13.50 చొప్పున పరుగులిచ్చాడు. ముకేశ్‌ కుమార్‌, అక్షర్‌ పటేల్‌ కట్టడి చేయకుంటే.. ఆసీస్‌ స్కోరు 250 చేరుకునేదే. ఈ నేపథ్యంలో భారత బౌలర్లు పరుగులు నియంత్రించాల్సిన అవసరం ఎంతో ఉంది.

ఆస్ట్రేలియా బ్యాటింగ్ బాగున్నా.. బౌలింగ్ సమస్యగా మారింది. జాసన్ బెరెన్‌డార్ఫ్‌ బాగా బౌలింగ్ చేసినా.. మిగతా బౌలర్లు నిరాశపరిచారు. ఎలిస్‌, అబాట్‌ ధారాళంగా పరుగులు ఇచ్చారు. బ్యాటింగ్‌లో స్టీవ్‌ స్మిత్‌ ఆకట్టుకోగా.. ఇంగ్లిస్‌ సెంచరీ కొట్టేశాడు. షార్ట్‌, స్టోయినిస్‌, డేవిడ్‌, వేడ్‌లతో ఆసీస్‌ బ్యాటింగ్‌ బలంగా ఉంది. బ్యాటింగ్‌కు అనుకూలించే తిరువనంతపురం పిచ్‌పై పరుగుల వరద పారనుంది.

Also Read: Rahul Gandhi: హైదరాబాద్‌లో రాహుల్ ఆకస్మిక పర్యటన.. నిరుద్యోగులతో చిట్ చాట్

తిరువనంతపురం పిచ్‌ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పేసర్లకు సహకరించే అవకాశం ఉంది. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకోనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. తిరువనంతపురంలో నిన్న వర్షం పడింది. దాంతో పిచ్‌ను రోజంతా కవర్లతో కప్పి ఉంచారు. ఆదివారం కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్‌కు అంతరాయం తప్పకపోవచ్చు.