Site icon NTV Telugu

AUS vs IND: నేడే ఆస్ట్రేలియా, భారత్ మొదటి టీ20.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్ డీటెయిల్స్ ఇవే!

India Vs Australia 1st T20

India Vs Australia 1st T20

వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్.. ఆస్ట్రేలియాతో పొట్టి క్రికెట్‌ సిరీస్‌కు సిద్ధమైంది. 5 టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు కాన్‌బెర్రాలో మొదటి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.45 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. వన్డే సిరీస్‌ కోల్పోయినా.. ఇటీవలే ఆసియా కప్‌ 2025 గెలిచిన ఊపులో ఉండడం, జట్టు పటిష్టంగా కనిపిస్తుండడంతో సిరీస్‌ గెలవడానికి టీమిండియాకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా కూడా బలంగా ఉండడంతో హోరాహోరీగా మ్యాచ్ సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆసియా కప్‌లో అభిషేక్‌ శర్మ మంచి ప్రదర్శన చేశాడు. దాంతో ఆసీస్ గడ్డపై అభిషేక్‌ ఎలా ఆడుతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పేస్‌కు సహకరించే కాన్‌బెర్రా పిచ్‌పై జోష్ హేజిల్‌వుడ్‌ లాంటి టాప్ క్లాస్ బౌలర్‌ను ఎలా ఎదుర్కొంటాడన్నది ఇప్పుడు ఆసక్తికరం. టెస్టుల్లో అదరగొడుతున్నప్పటికీ.. వన్డే, టీ20ల్లో నిరాశపరుస్తున్న శుభ్‌మన్‌ గిల్‌ ఈ సిరీస్‌లో రాణించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. తిలక్‌ వర్మ మీద భారీ అంచనాలున్నాయి. సూర్యకుమార్‌ యాదవ్‌ ఫామ్ కలవరపెడుతోంది. సంజు శాంసన్, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. జస్‌ప్రీత్‌ బుమ్రా జట్టులో ఉండడం కలిసొచ్చే అంశం. అర్ష్‌దీప్‌ సింగ్ కొత్త బంతిని పంచుకోనున్నాడు. హర్షిత్‌ రాణా మూడో పేసర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్షర్‌కు తోడుగా వరుణ్‌, కుల్‌దీప్‌లలో ఒకరు తుది జట్టులో ఉంటారు.

వన్డేల కంటే టీ20ల్లో ఆస్ట్రేలియా బలంగా ఉంది. ట్రావిస్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌, టిమ్‌ డేవిడ్, మార్కస్ స్టాయినిస్, జోష్‌ ఇంగ్లిస్‌ లాంటి స్టార్స్ ఉన్నారు. హెడ్‌ టీ20ల్లో చెలరేగుతాడని జట్టు ఆశిస్తోంది. మార్ష్‌ ఫామ్ మీదున్నాడు. మాథ్యూ షార్ట్, మిచెల్‌ ఒవెన్‌లు సత్తాచాటనున్నారు. హేజిల్‌వుడ్‌కు తోడు బార్ట్‌లెట్, డ్వార్షుయిస్, ఎలిస్‌లతో పేస్‌ విభాగం బలంగా ఉంది. ఆడమ్‌ జంపా లేకున్నా కునెమన్‌ నుంచి టీమిండియాకు ప్రమాదం పొంచి ఉంది.

కాన్‌బెర్రాలో పిచ్‌ పేస్ బౌలర్లకు అనుకూలం. ఇక్కడ పేసర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు పెను సవాలే. బౌండరీలు కూడా పెద్దవి కావడంతో రన్స్ అంత ఈజీగా రావు. కాన్‌బెర్రాలో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశాలు తక్కువ. 160-170 స్కోరు చేస్తే విజయం సాధించే అవకాశాలు మెండు. ఈరోజు వర్షం పడే అవకాశాలు ఉన్నా.. మ్యాచ్‌కు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు.

Also Read: Cyclone Montha Update: బలహీనపడిన తీవ్ర తుఫాన్ మొంథా.. రానున్న 6 గంటల్లో..!

తుది జట్లు (అంచనా):
భారత్‌: అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), సంజు శాంసన్, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్, బుమ్రా, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్, వరుణ్‌ చక్రవర్తి/కుల్‌దీప్‌.
ఆస్ట్రేలియా: మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), ట్రావిస్‌ హెడ్, జోష్‌ ఇంగ్లిస్, మాథ్యూ షార్ట్, మిచెల్‌ ఒవెన్, స్టాయినిస్, టిమ్‌ డేవిడ్, డ్వార్షుయిస్‌/ఎలిస్, బార్ట్‌లెట్, హేజిల్‌వుడ్, కునెమన్‌.

Exit mobile version