NTV Telugu Site icon

IND vs AFG: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌.. భారత కెప్టెన్‌ ఎవరు?

Team India

Team India

Shreyas Iyer could be the India Captain for Afghanistan T20 Series: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ అనంతరం భారత్ స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్‌తో ఆడనుంది. 2024 జనవరి 11న ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2024కు ముందు టీమిండియా ఆడనున్న చివరి సిరీస్‌ ఇదే. అఫ్గానిస్తాన్‌ టీ20 సిరీస్‌ కోసం భారత జట్టును మరో వారం రోజుల్లో బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ పొట్టి సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌ ఎవరు అనే సందిగ్ధం నెలకొంది.

ఇప్పటివరకు టీ20ల్లో భారత జట్టును నడిపించిన హార్దిక్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌లు గాయాల బారిన పడ్డాడు. వన్డే ప్రపంచకప్ 2023లో గాయపడిన హార్దిక్‌ కోలుకోవడానికి ఇంకా సమయం పట్టనుంది. దక్షిణకాఫ్రికా పర్యటనలో గాయపడిన సూర్య, రుత్‌రాజ్‌ కూడా కోలుకోవడానికి సమయం పట్టనుందట. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా ఎవరిని నియమించాలని బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ తలలు పట్టుకుంటుంది. ఇటీవలి కాలంలో టీ20లకు దూరంగా ఉంటున్న టీమిండియా రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో బీసీసీఐ ఛీప్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌ సిరీస్‌లో కెప్టెన్‌గా ఉండాలని కోరినట్లు సమాచారం. అయితే రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు సమయం అడిగాడట.

Also Read: Vijayakanth COVID-19: కెప్టెన్ విజయ్‌కాంత్‌కు కరోనా.. అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి!

ఒక వేళ రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఉండేందుకు అంగీకరించకపోతే.. మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు అప్పగించే యోచనలో బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రేయస్‌కు కెప్టెన్‌గా అనుభవం ఉంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. శ్రేయస్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కూడా ఉన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023 సహా దక్షిణాఫ్రికా పర్యటనలో అదరగొట్టాడు. టెస్టుల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు.