దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి కొనసాగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ పార్టీ బ్యాంకు ఖాతాలు స్తంభించాయని ఇవాళ తెలిపింది. వాటిలో యూత్ కాంగ్రెస్ ఖాతాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ‘ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించడం అని అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అజయ్ మాకెన్ మండిపడ్డారు. తమ ఖాతాలను ఆదాయపన్ను శాఖ స్తంభింపజేసిందని ఆయన ఆరోపించారు.
ఇక, ఈరోజు విలేకరుల సమావేశంలో మాకెన్ మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలలోని 210 కోట్ల రూపాయలను కట్టాలని ఆదాయపు పన్ను చెప్పింది. అయితే, ఎన్నికలకు కేవలం 2 వారాల ముందు ప్రతిపక్షాల బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడం.. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడం లాంటిది అని ఆయన అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఖర్చు చేయడానికి, బిల్లులు కట్టడానికి లేదా ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా నిధులు లేవని అజయ్ మాకెన్ అన్నారు.
Read Also: PM Modi: దేశాన్ని కాంగ్రెస్ అంధకారంలోకి నెట్టింది.. మేమే బయటకు తీసుకొచ్చాం..
ఆదాయపు పన్ను శాఖ తీరు వల్ల భారత్ జోడో న్యాయ యాత్రే కాదు.. తమ పార్టీ రాజకీయ కార్యకలాపాలన్నీ దెబ్బతింటాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఖాతాలను స్తంభింపజేయడం భారత ప్రజాస్వామ్యంపై తీవ్రమైన దాడిగా పరిగణిస్తామని ఆయన వెల్లడించారు.