NTV Telugu Site icon

IND vs SL: నేను కూడా బ్యాడ్‌ కెప్టెన్‌.. కెప్టెన్సీపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

Rohit

Rohit

Rohit Sharma React on His Capataincy in ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో వరుసగా విజయాలు సాధిస్తున్నాం కాబట్టి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని, ఎప్పుడో ఒకప్పుడు పరాజయం పాలైనపుడు తాను కూడా బ్యాడ్‌ కెప్టెన్‌గా కనిపిస్తా అని టీమిండియా సారథి రోహిత్ శర్మ అన్నాడు. మైదానంలో పరిస్థితులును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకుంటానని తెలిపాడు. మైదానంలో తీసుకునే నిర్ణయాలు జట్టు విజయం కోసం మాత్రమేనని తాను నమ్ముతానని రోహిత్ చెప్పాడు. ప్రపంచకప్‌లో వరుసగా ఆరు విజయాలు అందుకున్న భారత్ సెమీస్‌ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. రోహిత్ వ్యక్తిగత ప్రదర్శనతో పాటు అద్భుత కెప్టెన్సీతో టీమిండియాను ముందుకు నడిపిస్తున్నాడు.

శ్రీలంకతో మ్యాచ్‌ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ శర్మ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. ‘ఇప్పుడు పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయి. అందుకే అంతా బాగానే ఉంది. ప్రతి మ్యాచ్‌ ఫలితంపై నాకు ఓ అవగాహన ఉంది. వరుసగా విజయాలు సాధిస్తున్నపుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఎప్పుడో ఒకప్పుడు అపజయం ఎదురైనపుడు నేను కూడా బ్యాడ్‌ కెప్టెన్‌గా కనిపిస్తా. విమర్శలు, ట్రోల్స్ వస్తాయి. ఇప్పటికైతే జట్టు విజయం కోసం ఏం అవసరమనే దానిపైనే దృష్టిసారించా’ అని రోహిత్ తెలిపాడు.

Also Read: New Zealand Semis Chances: హ్యాట్రిక్ ఓటములు.. డేంజర్ జోన్‌లో న్యూజీలాండ్! సెమీస్ ఛాన్సెస్ ఇలా

‘మైదానంలో పరిస్థితులును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. నిర్ణయాలు తీసుకుంటా. ప్రతి చిన్న విషయంపైనా విశ్లేషణ చేసి.. ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలి. కొన్నిసార్లు అవి సఫలం అవుతాయి, మరికొన్నిసార్లు విఫలం అవుతాయి. ఏదేమైనా ప్రయత్న లోపం మాత్రం అస్సలు ఉండకూడదు. మైదానంలో తీసుకునే నిర్ణయాలు జట్టు విజయం కోసం మాత్రమే అని నమ్ముతా. ప్రత్యర్థి జట్ల బలాలు ఏంటి? అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. ఇదే విషయం బౌలర్లకూ వివరిస్తా. టోర్నీలో ఇప్పటివరకు మేము చేసిందిదే. వికెట్ల కోసం వెళ్లడం లేదా బ్యాటర్లను పరుగులు చేయకుండా అడ్డుకొనేందుకు ఫీల్డింగ్‌లో మార్పులు కీలకం. చిన్నపాటి మార్పులు, వ్యూహాత్మక నిర్ణయాల వల్ల మ్యాచులో ఆధిపత్యం ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుంది. వ్యూహ రచనలో సహచర ఆటగాళ్లూ భాగస్వాములు కావడం చాలా ముఖ్యం. అయితే ఇది తేలికైన విషయం కాదు. ఆటగాళ్లూ పాటించకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ఫలితం రాదు. జట్టు విజయాల్లో నాతో పాటు పది మందికీ క్రెడిట్‌ ఇవ్వాలి. జట్టు నిర్ణయాలకు అనుగుణంగా మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లేది వారే’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.