Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!

Hyundai New Car

Hyundai New Car

Hyundai Electric Car-Hyundai Ioniq P: భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో తన ఉనికిని మరింత బలంగా చాటుకోవడానికి హ్యుందాయ్ మోటార్స్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న క్రెటా ఈవీ (Creta EV) కంటే తక్కువ ధరలో, అత్యంత చౌకైన ఒక ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఆశించిన స్థాయిలో పెద్ద విజయాన్ని సాధించలేకపోయిన హ్యుందాయ్, ఈ కొత్త కార్ ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవాలని భావిస్తోంది. ప్రత్యేకంగా భారత్ కోసం రూపొందిస్తున్న ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి కంపెనీ ‘HE1i’ అనే కోడ్‌నేమ్ కేటాయించింది. తాజా వార్తల ప్రకారం, ఈ కారుకు ‘హ్యుందాయ్ ఐయోనిక్ పి’ (Hyundai Ioniq P) అని పేరు పెట్టే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో హ్యుందాయ్ ఐయోనిక్ బ్రాండ్‌కు మంచి పేరుంది. కాబట్టి ఈ పేరును చిన్న కారుకు ఇవ్వడం ద్వారా కస్టమర్లలో మరింత నమ్మకాన్ని, ఆదరణను పెంచవచ్చని కంపెనీ యోచిస్తోంది.

2026 మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాల కాన్ఫరెన్స్ కాల్‌లో హ్యుందాయ్ మేనేజ్‌మెంట్ తమ భవిష్యత్తు ఉత్పత్తుల గురించి చర్చించింది. బయోన్ (Bayon) మోడల్ తర్వాత భారత మార్కెట్లో ఐయోనిక్ పి ని లాంచ్ చేసే అవకాశం ఉందని తెలిపింది. అయితే కంపెనీ ఇప్పటివరకు ఈ పేరును అధికారికంగా ఖరారు చేయలేదని, అలాగే ఐయోనిక్ పి ని హెచ్‌ఈ1ఐ కోడ్‌నేమ్‌తో నేరుగా ముడిపెట్టలేదని గుర్తుంచుకోవాలి. ఏది ఏమైనా, రోజురోజుకూ పుంజుకుంటున్న ఈవీ విభాగంలో ఈ కొత్త మోడల్ వినియోగదారులకు ఒక సరసమైన, నమ్మకమైన ఆప్షన్‌గా మారనుంది. ఇక, మన దేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం 2027 నాటికి ఈ సెగ్మెంట్‌లో ఏకంగా 90 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత చౌకైన ఈ ఎలక్ట్రిక్ కారు ఈ ఏడాది చివర్లోగానీ, లేదా వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ విడుదలయ్యే అవకాశం ఉంది. కారు తయారీ ప్రారంభంలో హ్యుందాయ్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న బ్యాటరీ సెల్స్‌ను ఉపయోగిస్తుంది. ఆ తర్వాత భారత్‌కు చెందిన ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ ఎక్సైడ్ (Exide) నుంచి బ్యాటరీలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అయితే హ్యుందాయ్-కియా ప్రోగ్రామ్ కింద ఈ ఏడాది నుంచే బ్యాటరీల సరఫరా ప్రారంభించడం కుదరదని ఎక్సైడ్ స్పష్టం చేసింది. దాంతో మున్ముందు ఈ కారును పూర్తిగా స్థానిక భాగాలతో రూపుదిద్ది విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. సాధ్యమైనంత ఎక్కువ మేర స్థానిక విడిభాగాలను ఉపయోగించడం ద్వారా కారు ధరను గణనీయంగా తగ్గించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ ధరను రూ.10 లక్షల కంటే తక్కువగానే నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది.