NTV Telugu Site icon

Hyundai Motor: కార్ల ధరలకు రెక్కలు.. ఏప్రిల్ నుండి హ్యూండాయ్ కార్ల ధరల పెంపు

Hyundai Motor

Hyundai Motor

Hyundai Motor: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన వాహనాల ధరలను ఏప్రిల్ నుంచి 3 శాతం వరకు పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కంపెనీ ప్రకారం, ఈ ధర పెంపునకు పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులు, కమ్మోడిటీ ధరలు, ఇంకా అధిక ఆపరేషనల్ వ్యయాలు ప్రధాన కారణాలు అని వెల్లడించింది. ఇప్పటికే టాటా మోటార్స్, మారుతి సుజుకి, కియా వంటి ఇతర ఆటోమొబైల్ బ్రాండ్లు ఏప్రిల్ నుండి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు హ్యూండాయ్ కూడా ఈ జాబితాలో చేరింది. ఇతర కంపెనీల మాదిరిగానే హ్యూండాయ్ కూడా పెరిగిన ఉత్పత్తి ఖర్చులను వినియోగదారులపై బరువుగా మోపాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపింది.

Read Also: SSMB29 : మళ్లీ ఫొటో లీక్.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా..!

ఈ విషయమై హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. మేము వినియోగదారులపై భారం పడకుండా ఖర్చులను నియంత్రించేందుకు మాకున్నంతవరకు ప్రయత్నిస్తున్నాం. కానీ, ఆపరేషనల్ ఖర్చులు నిరంతరంగా పెరుగుతున్న నేపథ్యంలో, కొంత భారాన్ని ధరల పెంపు ద్వారా సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందని, ఏప్రిల్ 2025 నుండి ఈ చిన్న స్థాయి ధర సవరణ అమలులోకి వస్తుందని అన్నారు. భవిష్యత్తులో వినియోగదారులపై ప్రభావం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

హ్యూండాయ్ భారతదేశంలో విస్తృత శ్రేణిలో కార్లను అందిస్తోంది. ఈ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న గ్రాండ్ i10, ఎక్స్టర్, వెన్యూ, క్రెటా, ఆల్కజార్, టక్సన్, ఐయోనిక్ 5 వంటి మోడళ్లు ఉన్నాయి. కొత్తగా రాబోయే హ్యూండాయ్ క్రెటా EV కూడా ఈ ధర పెంపుతో మరింత ఖరీదవ్వనుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి లేదా ఏప్రిల్ నెలలో కార్ల తయారీ కంపెనీలు తమ ధరలను సవరించుకుంటాయి. గత కొన్ని సంవత్సరాలుగా అధిక ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా కంపెనీలు ఏడాదికి ఒక్కసారి కాకుండా రెండుసార్లు కూడా ధరలను పెంచే ధోరణి కొనసాగిస్తున్నాయి.

Read Also: Matthew Brownlee: 62ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం.. ఆయన ఎవరంటే?

అయితే, గత నెలలో పాత స్టాక్‌ను అమ్మడానికి కంపెనీలు భారీ డిస్కౌంట్లను అందించే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ ముగియనున్న నేపథ్యంలో డీలర్లు మిగిలిపోయిన స్టాక్‌ను క్లియర్ చేసేందుకు ఆకర్షణీయమైన తగ్గింపు ధరలను ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి హ్యూండాయ్ కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నవారు ఈ నెలలోనే మంచి డీల్ పొందాలంటే వెంటనే డీలర్‌షిప్‌లను సంప్రదించాలి.