Hyderabad: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద శనివారం తెల్లవారుజాము నుంచే యువకులు భారీ సంఖ్యలో తరలివచ్చి సందడి చేశారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) అసిస్టెంట్లు, డ్రైవర్ల పోస్టుల భర్తీకి సంబంధించి హైడ్రా (HYDRAA) నోటిఫికేషన్ విడుదల చేయడంతో, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు, ఎంపిక ప్రక్రియకు హాజరయ్యేందుకు నిరుద్యోగ యువత పోటీపడ్డారు. పొద్దుపొడవక ముందే వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులతో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, దాని పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో యువకులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడటంతో స్టేడియం ప్రాంగణం కోలాహలంగా మారింది. క్రమశిక్షణతో కూడిన నిర్వహణ కోసం అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. ఈ పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో నిరుద్యోగులు ఏ స్థాయిలో ఉన్నారో తెలుస్తోంది.
అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి?
హైదరాబాద్‌లో ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘హైడ్రా’ (HYDRAA) ఇటీవల నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. హైడ్రాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు, ముఖ్యంగా క్రీడా నైపుణ్యాలు, శారీరక దారుఢ్యం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక చక్కటి అవకాశం మని అందరూ భావించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 100 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) అసిస్టెంట్ పోస్టులు ఉండగా, మిగిలిన 50 హెవీ వెహికల్స్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలు దాటకూడదు. విద్యా అర్హతల విషయానికొస్తే పదో తరగతి (SSC) ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు. డ్రైవర్ పోస్టుకు పోటీపడే అభ్యర్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా శారీరక సామర్థ్య పరీక్షల (Physical Tests) ఆధారంగానే జరుగుతుంది. అభ్యర్థులు 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 50 సెకన్లలో (170 సెకన్లు), 100 మీటర్ల పరుగును 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు 4 మీటర్ల లాంగ్ జంప్ , 7.2 కేజీల షాట్‌పుట్‌ను 6 మీటర్ల దూరం విసరడం లాంటి భౌతిక పరీక్షలు నిర్వహిస్తారు.

