Site icon NTV Telugu

Fake Gold: మెరిసేదంతా బంగారం కాదు.. ‘గోల్డ్ మ్యాన్’ కాస్త రోల్డ్ గోల్డ్ అయ్యాడుగా..

Rold Gold

Rold Gold

హైదరాబాద్ నగరంలో భారీ బంగారు ఆభరణాలతో సోషల్ మీడియాను ఊపేసిన ‘గోల్డ్ మ్యాన్’ సూర్య భాయ్ అసలు రంగు బయటపడింది. అత్తాపూర్ ప్రాంతానికి చెందిన పల్లపు సురేష్ కుమార్‌ అలియాస్ ‘సూర్య భాయ్’ చుట్టూ అల్లుకున్న మెరిసే ఇమేజ్ అంతా కేవలం ‘నకిలీ’ అని ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు తేల్చారు. విచారణలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

నకిలీ వెలుగులు.. అసలు నిజాలు..

తెలంగాణ హాకీ సంఘం అధ్యక్షుడు కొండ విజయ్‌కుమార్ (బంగారు బాబు) వద్ద ఢిల్లీ విమానాశ్రయంలో 1.4 కిలోల బంగారం దొరికిన కేసు దర్యాప్తులో భాగంగా సూర్య భాయ్ పేరు వెలుగులోకి వచ్చింది. సూర్య భాయ్ సోషల్ మీడియా పోస్టులు, యూట్యూబ్ ఇంటర్వ్యూలను గమనించిన అధికారులు ఆయన ఆర్థిక మూలాలను ఆరా తీశారు. తీరా విచారణకు పిలిపించి ఆభరణాలను పరీక్షించగా అధికారులే అశ్చర్యపోయారు.

Also Read:RBI Plan: రూపాయి విలువ పెంచేందుకు ఆర్బీఐ మాస్టర్ ప్లాన్.. ఇక దూసుకుపోవడమే..

సూర్య భాయ్ వద్ద ఉన్న సుమారు 32 రకాల భారీ నగలలో మెజారిటీ భాగం రాగితో చేసి రోడియం పూత పూసినవేనని తేలింది. సుమారు కోటి రూపాయల విలువ ఉంటుందని అతను కలరింగ్ ఇచ్చిన నగలు, మార్కెట్ ధర ప్రకారం కేవలం రూ. 3 లక్షలే అని అధికారులు నిర్ధారించారు. ఇవి త్వరగా రంగు వెలిసిపోతుండటంతో, కొత్తవి అన్నట్టుగా తరచూ మారుస్తూ జనాలను నమ్మించేవాడని దర్యాప్తులో తేలింది.

ఆస్తి కంటే ఇమేజ్ కోసమే ఆరాటం..

సూర్య భాయ్ జీవనశైలి చూస్తే కోటీశ్వరుడిలా అనిపించినా, అతని ఆర్థిక పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. 2022-23లో కేవలం రూ. 4.9 లక్షల ఆదాయం మాత్రమే చూపించాడు. గత ఆరేళ్లుగా అసలు ఐటీ రిటర్నులే దాఖలు చేయలేదు. తన పేరు మీద కానీ, భార్య పేరు మీద కానీ ఎలాంటి స్థిరాస్తులు లేవు. నెలకు రూ. 20 వేల అద్దె ఇంట్లోనే నివసిస్తున్నాడు. తన వద్ద ఉన్న థార్, ఎండీవర్ వంటి లగ్జరీ వాహనాలను భూవివాదాల్లో వచ్చే కమిషన్లతో కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

పాపులారిటీ కోసమే ఈ వేషధారణ..

ఐటీ అధికారుల విచారణలో సూర్య భాయ్ అసలు ఉద్దేశాన్ని బయటపెట్టాడు. ‘సినిమాల్లో అవకాశాలు పొందడానికి, రాజకీయాల్లోకి రావడానికి పాపులారిటీ అవసరమని భావించి ఇలా చేశాను’ అని ఒప్పుకున్నాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన అతను, జనాల దృష్టిని ఆకర్షించేందుకు ఈ ‘గోల్డ్ మ్యాన్’ అవతారం ఎత్తాడు. మెరిసేదంతా బంగారం కాదని సూర్య భాయ్ ఉదంతం మరోసారి నిరూపించింది. ప్రస్తుతం అధికారులు ఈ కేసులో ఇతర ఆర్థిక లావాదేవీలపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Exit mobile version