Hyderabad: న్యూ ఇయర్ వేళ హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా లెక్కచేయకుండా కొందరు మందుబాబులు తాగి రోడ్లపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ తమకే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే కాకుండా, ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చిపెడుతున్నారు. తనిఖీల సమయంలో కొందరు మందుబాబులు పోలీసులకు సహకరించకుండా చుక్కలు చూపించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతంలో ఓ మందుబాబు చేసిన హల్చల్ స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి రోడ్డుపై పడుకుని గందరగోళం సృష్టించాడు. కానిస్టేబుల్ తనను కొట్టాడంటూ ఆరోపణలు చేస్తూ రోడ్డుపై కూర్చుని హడావిడి చేశాడు. తాను బైక్ నడపలేదని, అయినా కానిస్టేబుల్ తనను కొట్టాడంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు. మద్యం మత్తు తగ్గే వరకు కొంతసేపు రోడ్డుపై పడుకుని ఆ వ్యక్తి హల్చల్ చేశాడు.
మరోవైపు.. నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు నగరవ్యాప్తంగా ప్రత్యేకంగా నిర్వహించిన తనిఖీల్లో ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డారు. మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. న్యూ ఇయర్ వేడుకల సమయంలో ప్రమాదాలు జరగకుండా, ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రాణాలకే ముప్పు ఉందని, ఇలాంటి తప్పులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిటీ పోలీసులు మరోసారి హెచ్చరించారు.
