Hyderabad Drug Racket Busted: హైదరాబాద్ శివార్లలో ఫార్మా పరిశ్రమల ముసుగులో సాగుతున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్‌ను ఈగల్ ఫోర్స్ అధికారులు ఛేదించారు. కొండమడుగు, మౌలాలి పారిశ్రామిక ప్రాంతాల్లోని ల్యాబ్‌లను అడ్డాగా చేసుకుని మత్తు పదార్థాలను తయారు చేస్తున్న భారీ నెట్‌వర్క్‌ను గుర్తించారు. ఈ వ్యవహారంలో నాగ్‌పూర్‌కు చెందిన ముఠా కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మహారాష్ట్రలో పోలీసుల నిఘా పెరగడంతో ముఠా ప్రధాన సూత్రధారి చేతన్ మేశ్రామ్ తన కార్యకలాపాలను హైదరాబాద్‌కు మార్చినట్లు అధికారులు తెలిపారు. అస్సాంకు చెందిన ఆయూబ్ సాయంతో నగరానికి వచ్చిన చేతన్.. కొండమడుగులోని ఓ ల్యాబ్‌లో కెమికల్ రియాక్టర్‌ను లీజుకు తీసుకుని డ్రగ్స్ తయారీ ప్రారంభించినట్లు గుర్తించారు. గతంలో ఆ ల్యాబ్‌లో పనిచేసిన వ్యక్తుల సహకారంతో ఆల్ప్రాజోలం, మెఫెడ్రోన్, ఎఫిడ్రిన్ వంటి మత్తు పదార్థాలను తయారు చేసినట్లు వెల్లడైంది.
డ్రగ్స్ తయారీకి ఉపయోగించే నిషేధిత రసాయనం ప్రొపియోనైల్ క్లోరైడ్‌ను గుజరాత్‌లోని వల్సాద్ నుంచి సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసుల కళ్లుగప్పేందుకు రసాయనాల డబ్బాలపై ‘హైడ్రోక్లోరిక్ యాసిడ్’ పేరుతో తప్పుడు లేబుళ్లు వేసి నాగ్‌పూర్ మీదుగా హైదరాబాద్‌కు తరలించినట్లు అధికారులు గుర్తించారు. 2025 ఆగస్టు నుంచి 2026 జూలై వరకు పలుమార్లు రసాయనాలను తరలించి పెద్ద మొత్తంలో మెఫెడ్రోన్ తయారు చేసినట్లు వెల్లడైంది.
మరోవైపు మౌలాలిలోని మరో ల్యాబ్‌లో కూడా డ్రగ్స్ తయారీకి ప్రయత్నాలు జరిగినట్లు గుర్తించారు. అక్కడ రియాక్టర్‌ను లీజుకు తీసుకుని ఆల్ప్రాజోలం, ఎఫిడ్రిన్ తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గతంలో దాడులు నిర్వహించి పలువురిని అరెస్ట్ చేసింది. డ్రగ్స్ తయారీకి అవసరమైన రసాయనాలను సరఫరా చేస్తున్న ముంబై వాసాయికి చెందిన వ్యాపారిని ఈగల్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. గుజరాత్ నుంచి రసాయనాలను సరఫరా చేస్తున్న అతడిని అక్టోబర్ 17న అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు.
డ్రగ్స్ తయారీ కేంద్రాల్లో పనిచేయించేందుకు అస్సాం, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా వచ్చిన వలస కార్మికులను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. కెమిస్ట్ మువ్జమిల్ ద్వారా వారికి తయారీ ప్రక్రియపై శిక్షణ ఇప్పించినట్లు గుర్తించారు. ఈ అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ వెనుక ఉన్న అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు ఈగల్ ఫోర్స్ దర్యాప్తును ముమ్మరం చేసింది.

