Diwali Firecracker Accidents: దీపావళి పండుగ వేళ హైదరాబాద్‌లో టపాసుల పేలుళ్లు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. బాణసంచా కాల్చే సమయంలో జరిగిన ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. కంటి గాయాలతో బాధపడుతున్న వారు భారీ సంఖ్యలో సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు ఆస్పత్రిలో 60 మంది బాధితులు ఔట్ పేషెంట్ (OP) కేసులుగా నమోదైనట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఆస్పత్రిలో నమోదైన బాధితుల్లో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తొలుత అందిన సమాచారం ప్రకారం 13 మందిని ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా.. సూపరింటెండెంట్ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం 10 మంది ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. ఒకరికి కంటి గుడ్డు బయటకు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. అడ్మిట్ అయిన వారిలో ఇద్దరికి కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.
ఈ ప్రమాదాల్లో చిన్నారులు కూడా పెద్ద సంఖ్యలో గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు నమోదైన 60 కేసుల్లో సుమారు 30 మంది చిన్నారులు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. టపాసులు కాల్చిన వారితో పాటు రోడ్లపై వెళ్తున్న పాదచారులు కూడా బాణసంచా ప్రమాదాలకు గురయ్యారు. కంటి గాయాలతో వచ్చిన వారికి సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చర్మంపై కాలిన గాయాలతో వచ్చిన బాధితులను మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈరోజు కూడా బాణసంచా కాల్చే అవకాశం ఉండటంతో బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని ఆస్పత్రి వర్గాలు అంచనా వేస్తున్నాయి.
టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే శాశ్వతంగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు బాణసంచా కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూచిస్తున్నారు. ప్రమాదకరమైన టపాసులకు పిల్లలను దూరంగా ఉంచాలని, కళ్లకు గాయమైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

