VC Sajjanar: వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త వాట్సాప్ మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ తెలిపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్‌కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపడం ద్వారా కంప్యూటర్లలోకి మాల్వేర్‌ను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల సిస్టమ్స్‌పై నేరగాళ్లు పూర్తిస్థాయి రిమోట్ యాక్సెస్‌ను పొందుతూ అక్రమాలకు తెరలేపుతున్నారని చెప్పారు. ఈ మేరకు వివరాలు వెల్లడిస్తూ ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. సిస్టమ్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత అందులో యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను నేరగాళ్లు చాకచక్యంగా వినియోగిస్తున్నారని సీపీ తెలిపారు. సీఈఓ లేదా సీఎఫ్ఓల పేరుతో అకౌంటెంట్లకు తప్పుదారి పట్టించే సందేశాలను పంపిస్తూ నమ్మిస్తున్నారని వెల్లడించారు.
తాము అత్యవసర సమావేశంలో ఉన్నామని, ఫోన్ ఎత్తడం వీలుపడదని చెబుతూ కోట్లాది రూపాయలు కాజేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో తక్షణమే తమ ఖాతాలకు డబ్బును బదిలీ చేయించుకుంటున్నారని చెప్పారు. పై అధికారుల నంబర్ల నుంచే సందేశాలు వస్తుండటంతో అకౌంటెంట్లు కూడా నిజమేనని నమ్మి మోసపోతున్నారని అన్నారు. ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రతి కంపెనీ కూడా ఇటువంటి సైబర్ దాడుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాట్సాప్‌లో పై అధికారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకూడదని పేర్కొన్నారు. వెంటనే అధికారులకు నేరుగా ఫోన్ చేసి ఆ సందేశం నిజమేనా కాదా అని ధృవీకరించుకోవాలని చెప్పారు. ఆఫీసు సిస్టమ్స్‌లో నాణ్యమైన ఫైర్‌వాల్స్, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను నిరంతరం అప్‌డేట్ చేసి ఉంచాలని అన్నారు. వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారి తప్పకుండా లాగౌట్ చేయడం మర్చిపోవద్దని తెలిపారు. సాంకేతిక భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారానే ఇటువంటి దాడులను ఎదుర్కోగలమని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని సజ్జనర్ చెప్పారు. అలాగే బాధితులు http://cybercrime.gov.in పోర్టల్‌లో తమ ఫిర్యాదును వెంటనే నమోదు చేయాలని అన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని వివరించారు.
