NTV Telugu Site icon

Abid Ali Death: హైదరాబాద్‌ దిగ్గజ క్రికెటర్‌ కన్నుమూత.. భారత్‌ తరఫున తొలి బంతి వేసిన ఘనత!

Syed Abid Ali Passed Away

Syed Abid Ali Passed Away

భారత మాజీ ఆల్‌రౌండర్‌, హైదరాబాద్‌ దిగ్గజ క్రికెటర్‌ సయ్యద్‌ అబిద్‌ అలీ (83) కన్నుమూశారు. కెరీర్‌ అనంతరం అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డ ఆయన అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని అబిద్‌ అలీ బంధువు రెజా ఖాన్‌ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అబిద్‌ అలీ మృతి పట్ల టీమిండియా మాజీ క్రికెటర్లు సంతాపం ప్రకటించారు. టీమిండియా దిగ్గజం సునీల్‌ గవాస్కర్, భారత మాజీ క్రికెటర్ అండ్ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌లు అబిద్‌ అలీ సేవలను గుర్తుచేసుకున్నారు.

సయ్యద్‌ అబిద్‌ అలీ 1967-74 మధ్య భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 29 టెస్టుల్లో 20.36 సగటుతో 1018 పరుగులు చేశారు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మీడియం పేస్ బౌలింగ్‌తో 47 వికెట్లు (42.12 సగటు) తీశారు. 5 వన్డేల్లో 93 పరుగులు, 7 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మాత్రమే కాదు.. మేటి ఫీల్డర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. అబిద్‌ అలీ తక్కువ మ్యాచ్‌ల్లోనే తనదైన ముద్ర వేశారు. 1974 జూలై 13న లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో భారత జట్టు తొలి వన్డే మ్యాచ్‌ ఆడింది. ఆ మ్యాచ్‌లో అబిద్‌ అలీ తొలి బంతిని వేసి చిరస్మరణీయ ఘనతను సొంతం చేసుకున్నారు. తొలి వన్డే ప్రపంచ కప్‌లో (1975) న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 బంతుల్లో 70 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. అయితే అదే మ్యాచ్ ఆయనకు ఆఖరి వన్డే అయింది.

Also Read: WPL 2025 Eliminator: నేడు ఎలిమినేటర్‌ మ్యాచ్.. డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌ చేరేదెవరో!

దేశవాళీ క్రికెట్లోనూ అబిద్‌ అలీకి అద్భుత రికార్డు ఉంది. హైదరాబాద్‌ తరఫున 212 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 8,732 పరుగులు చేశారు. ఇందులో 13 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 173 నాటౌట్‌. బౌలింగ్‌లో 397 వికెట్స్ పడగొట్టగా.. 14 సార్లు 5 వికెట్స్ తీశారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆబిద్‌ అలీ.. రిటైర్మెంట్‌ అనంతరం కొన్నేళ్ల పాటు విరామం తీసుకున్నారు. ఆపై హైదరాబాద్‌ జూనియర్‌ జట్టుకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లిపోయారు. ఉత్తర అమెరికా క్రికెట్‌ లీగ్‌ (ఎన్‌ఏసీఎల్‌)తో కలిసి పని చేశారు. 2001-02 మధ్య ఆంధ్ర రంజీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో ఆంధ్ర రంజీ జట్టుకు ఎమ్మెస్కే ప్రసాద్‌ సారథిగా ఉన్నారు. మాల్దీవులు, యూఏఈ జట్లకు కూడా శిక్షణ ఇచ్చారు.