CI Suspended: హైదరాబాద్ పోలీసు శాఖలో సంచలనం రేపిన ఘటనలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగతంగా లొంగదీసుకుని.. ఆ తర్వాత ఆమెను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణలు అంతర్గత విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
దర్యాప్తు వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో సీఐగా పనిచేస్తున్న సమయంలో తన భర్తపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళతో శ్రీనివాసులు రెడ్డి పరిచయం పెంచుకున్నారు. ఆమెకు న్యాయం చేస్తానని నమ్మించి, ఆ తర్వాత వ్యక్తిగత సంబంధం కొనసాగించినట్లు విచారణలో తేలింది. అలా కొంతకాలం ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి నివసించినట్లు కూడా దర్యాప్తు అధికారులు గుర్తించారు.
బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం.. తనకు సంబంధించిన వీడియోలను అడ్డంగా పెట్టుకుని శ్రీనివాసులు రెడ్డి తన నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. దాదాపు కోటి రూపాయలకు పైగా నగదు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా తన పదోన్నతులు, బదిలీల కోసం కూడా తన డబ్బులను వినియోగించుకున్నట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై బాధిత మహిళ ఇటీవల ఉన్నతాధికారులను, అలాగే డీజీపీని నేరుగా కలిసి పూర్తి స్థాయి ఆధారాలను సమర్పించారు. ఆమె అందజేసిన ఫిర్యాదు, వీడియోలు, ఇతర ఆధారాల ఆధారంగా పోలీసు శాఖ ప్రత్యేక అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణలో మహిళ చేసిన కీలక ఆరోపణలకు మద్దతుగా ఆధారాలు లభించడంతో శ్రీనివాసులు రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది.
విచారణ అనంతరం ఆరోపణలు ప్రాథమికంగా నిజమని నిర్ధారించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బాధిత మహిళను బెదిరించినట్లు కూడా విచారణలో గుర్తించారు. అయితే ఇంకా ఈ వ్యవహారంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. తుది విచారణ నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

