Site icon NTV Telugu

Crime News: ఇద్దరు పిల్లలతో సహా భార్యను కోర్టుకు తీసుకెళ్లిన భర్త.. చివరికి..?

Murder

Murder

మూడుముళ్ల బంధంతో ఒక్కటై.. కష్టమైనా, సుఖమైనా కలిసే ఉంటామని బాసలు చేసిన ఆ భర్త.. కట్టుకున్న భార్యనే బలి తీసుకున్నాడు. ఈ ఘటన మెదక్‌‌లో కలకలం సృష్టించింది. అంతే కాదు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డ్రామా రక్తికట్టించినా.. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి ఆ భర్త కుట్ర బయట పడింది. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే..

సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ స్వస్థలంకు చెందిన రామాయంపేట రమ్యతో 2018లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లైన తర్వాత క్రమంగా నవీన్ మద్యానికి బానిస కావడంతో భార్య, భర్త మధ్య గొడవలు షురూ అయ్యాయి. మద్యం తాగి వచ్చి రోజూ వేధిస్తుండడంతో రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో రమ్య గృహ హింస కేసు నమోదు చేసింది. ఐతే కొంత కాలానికి.. తీరు మార్చుకుంటానంటూ అతడు పెద్దమనుషుల సమక్షంలో నమ్మించి భార్యను కాపురానికి తీసుకెళ్లాడు.

Read Also:Ponguleti Srinivasa Reddy: పదేళ్లు పరిపాలించిన పెద్దలు లక్షల కోట్లు అవినీతి చేశారు.. మంత్రి ఘాటు వ్యాఖ్యలు

అయినా మారకుండా మళ్లీ వేధిస్తుండడంతో రమ్య ఇద్దరు పిల్లలను తీసుకుని ఏడు నెలల కిందట పుట్టింటికి వచ్చేసింది. ఈ ఏడాది జనవరిలో నవీన్‌ అక్కడికి వచ్చి.. బయట గడియ పెట్టి, ఇంటిపై బాంబులు వేసి భయాందోళనలకు గురిచేశాడు. దీనిపై ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిపై హత్యాయత్నం, అక్రమ నిర్బంధం కేసు నమోదు చేశారు. ఈ కేసులో నవీన్‌ రెండు నెలలు జైలుకెళ్లి తిరిగి వచ్చాక.. మంచిగా ఉంటానంటూ మరోసారి పెద్దల సమక్షంలో హామీ ఇచ్చాడు.

ఇక నవీన్ మాటలు నమ్మిన రమ్య కుటుంబీకులు గృహహింస కేసును లోక్‌ అదాలత్‌లో ఉపసంహరించుకున్నారు. అక్రమ నిర్బంధం, హత్యాయత్నం కేసులో సైతం రాజీ కుదుర్చుకోవాలని అతడు భార్యపై ఒత్తిడి చేస్తున్నాడు. పోలీసులు సీజ్‌ చేసిన బైక్, సెల్‌ఫోన్‌ తీసుకోవడానికని చెప్పి.. భార్యాపిల్లలను వెంటబెట్టుకుని నవీన్‌ మెదక్‌ కోర్టుకు వచ్చాడు. సాయంత్రం ఆరు గంటల సమయంలో వారితో సహా కోర్టు భవనం పైకి ఎక్కాడు.

Read Also:Nithin : క్షమించండి.. ఇక నుంచి మంచి సినిమాలు చేస్తా

భార్య, ఇద్దరు పిల్లలను భవనంపై నుంచి కిందకు తోసేసి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు సీన్ క్రియేట్ చేశాడు. ఈ ఘటనలో రమ్య చనిపోయింది. నవీన్, ఇద్దరు పిల్లలు గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తనపై కేసులు పెట్టారన్న కక్షతో నవీన్‌ పథకం ప్రకారమే భార్యాపిల్లలను కిందికి తోసేశాడని రమ్య తల్లి రాజమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెదక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version