Hyderabad Crime: హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు పిల్లలను చంపి.. భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్ (40), వర్షిణి (33)గా గుర్తించారు. వీరికి రిషికాంత్ (11), విహంత్ (3) పిల్లలు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆన్ లైన్ బెట్టింగ్ వ్యాపారం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంకటేష్, వర్షిణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇవాళ ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇంటికి ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు.
ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్లి చూడగా నలుగురు మృతి చెంది కనిపించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని జీడిమెట్ల పోలీసులు తెలిపారు.
Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
