Hundred Crores Cheque: సాధారణంగా పుణ్య క్షేత్రాలకు వెళ్లినప్పుడు ఎవరి ఆర్థిక స్థోమత మేరకు దేవుడికి కానుకలు సమర్పించుకుంటారు. ధనవంతులైతే కోట్లలో విరాళాలు ఇస్తుంటారు. బంగారు తాపడాలు చేయిస్తుంటారు. సాధారణంగా పెద్దమొత్తంలో నగదు ఇచ్చినప్పుడు లేదా చెక్కు రూపంలో ఇచ్చినప్పుడు వాటిని ఆలయ అధికారులకు అందజేస్తారు. పేరు తెలియకూడదని ఎవరైనా భావిస్తే నగదు హుండీల్లో వేస్తారు. చాలావరకు చెక్కులను హుండీలో వేయకుండా నేరుగా అధికారులకు అందజేస్తారు.
దక్షిణ కాశీగా పేరొందిన అలంపుర్ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అలంపూర్ సమీపంలోనే కృష్ణ, తుంగభద్ర నదుల సంగమం అవుతుండటంతో ఈ క్షేత్రానికి విశిష్టత నెలకొన్నది. కాగా, ప్రతీ నెల ఈ ఆలయానికి సంబంధించిన హుండీని లెక్కిస్తారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ ఈవో పర్యవేక్షణలో సిబ్బంది ఈ లెక్కింపును చేపడతారు. శనివారం ఇలా హుండీలోని నాణేలు, నోట్లు, ఇతర కానుకలను వేరు చేస్తూ లెక్కిస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఓ చెక్కు కనపడింది.
Read Also: Kishan Reddy: తెలంగాణకి అప్పులు.. కేసీఆర్‌కి విమానాలు
ఆ చెక్కుపై ‘అక్షరాలా వంద కోట్ల రూపాయలు’ అని రాసి ఉంది. అయితే ఆ చెక్కు నిజమైనదేనా అని అనుమానం వచ్చిన ఆలయ అధికారులు ఆరా తీస్తే ఆసక్తికర సంగతులు వెల్లడయ్యాయి. ఆ చెక్కు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వరంగల్ బ్రాంచికి చెందినదని తెలిసింది. ఆ చెక్కును హుండీలో వేసిన వ్యక్తి ఆలంపూర్ మండలానికి చెందినవాడే. అయితే అతడికి మతిస్తిమితం లేదని గుర్తించారు. ఇక, వంద కోట్లు అని రాసిన ఆ వ్యక్తి బ్యాంకు అకౌంట్లో ఉన్నది కేవలం రూ.23 వేలేనట. అతడు తన చెక్కుపై ‘ఆర్మీ జవాన్ల కోసం’ అని రాసి ఉన్నట్టు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. కాగా, ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి రీత్యా పోలీసులు అతడిని హైదరాబాదులోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్పించినట్టు తెలిసింది.
