Site icon NTV Telugu

Hrithik Roshan: ఫస్ట్ సినిమాతోనే గిన్నిస్ రికార్డ్.. ఎవరా స్టార్.. ఏంటా కథ?

02

02

Hrithik Roshan: ప్రముఖ బాలీవుడ్ తారలలో హృతిక్ రోషన్ ఒకరు. ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ తన ప్రతిభతో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన గొప్ప నటుడు. మీకు తెలుసా ఆయన నటించిన తొలి చిత్రమే ఎన్నో సంచలనాలను నమోదు చేసిందని. హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన మొదటి చిత్రం ‘కహో నా ప్యార్ హై’. ఈ చిత్రం 2000 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా 2002లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చేర్చబడింది. నటుడిగా మొదటి సినిమాతోనే గిన్నిస్ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్న హృతిక్ రోషన్ ఇన్నేళ్ల తన సినీ కెరీర్‌లో ఎంతో మంది అభిమానులను, వారి అభిమానం, ప్రేమలను సంపాదించుకున్నారు. అసలు గిన్నిస్ రికార్డ్ సాధించిన హృతిక్ మొదటి సినిమాలో ఏముందో తెలుసుకుందామా..

READ MORE: Chatgpt Health Advice: కొంపముంచిన చాట్ జీపీటీ సలహా.. మీరు అలానే అడుగుతున్నారా?

‘కహో నా ప్యార్ హై’
2000 సంవత్సరంలో విడుదలైన ‘కహో నా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ హిందీ సినిమాలో ప్రధాన నటుడిగా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆయన తన తొలి చిత్రంతోనే ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా అమీషా పటేల్ నటించారు. విశేషం ఏమిటంటే అమీషాకు కూడా ఇది మొదటి సినిమా. ఈ చిత్రానికి డైరెక్షన్ చేసింది హృతిక్ తండ్రి రాకేష్ రోషన్. ఇదో ప్రేమకథా చిత్రం. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్. ఇందులో హృతిక్.. రోహిత్, రాజ్‌గా డబుల్ యాక్షన్ చేసి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన నటనకుగాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. అలాగే ఈ చిత్రానికి ఉత్తమ తొలిచిత్రంగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది.

ఈ సినిమా వివిధ విభాగాలలో మొత్తం 92 అవార్డులను గెలుచుకుంది. దీని కారణంగా 2002 లో ఈ చిత్రం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుసంపాదించుకుంది. హృతిక్ రోషన్, అమీషా పటేల్ కలిసి నటించిన ఈ చిత్రం ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రూ. 10 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.78 కోట్లు వసూలు చేసింది.

ఆగస్టు 14న ‘వార్ 2’ తో పలకరించినున్న హృతిక్..
బాలీవుడ్ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం ‘వార్ 2’ . వార్ చిత్రానికి సీక్వెల్గా వార్ 2 వస్తుంది. ఈ సినిమాకు ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌‌‌గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్‌లో ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది.

READ MORE: Eluru Police: పోలీసుల వినూత్న ప్రయత్నం.. ఇది పేద ప్రజలకు ఓ వరం..!

Exit mobile version