Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..

Whatsapp Chat

Whatsapp Chat

Transfer WhatsApp Chats: కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు చాలామందికి ఎదురయ్యే ప్రధాన సమస్య పాత ఫోన్‌లోని వాట్సాప్ చాట్స్, ఫోటోలు, ముఖ్యమైన మెసేజ్‌లను కొత్త డివైజ్‌లోకి ఎలా మార్చుకోవాలనేది. గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా, ఒక్క మెసేజ్ కూడా మిస్ అవ్వకుండా డైరెక్ట్‌గా పాత ఫోన్ నుంచి కొత్త మొబైల్‌కి పూర్తి వాట్సాప్ డేటాను సురక్షితంగా బదిలీ చేసుకునే సులువైన పద్ధతి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

చాలామంది కొత్త ఫోన్ తీసుకున్న వెంటనే వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసి, నేరుగా పాత మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ అయిపోతారు. ఇలా నేరుగా లాగిన్ అవ్వడం వల్ల పాత చాట్స్ ఏవీ కొత్త ఫోన్‌లోకి రావు. అవన్నీ పాత ఫోన్‌లోనే ఉండిపోయే ప్రమాదం ఉంది. అందుకే నంబర్ వెరిఫై చేసే ముందు చాట్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియను సరిగ్గా పాటించాలి. ఇందుకోసం ముందుగా మీ పాత ఫోన్‌లోని వాట్సాప్‌ను ఓపెన్ చేసి కుడివైపు పైన ఉండే సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లాలి. అక్కడ ఉన్న ‘చాట్స్’ (Chats) ఆప్షన్‌ను ఎంచుకుని క్రిందికి స్క్రోల్ చేస్తే ‘ట్రాన్స్‌ఫర్ చాట్స్’ (Transfer Chats) అనే ఫీచర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ప్రాసెస్ ప్రారంభించాల్సి ఉంటుంది.

ఇప్పుడు కొత్త ఫోన్‌లో వాట్సాప్‌ను ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయగానే స్క్రీన్‌పై ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ వెంటనే పాత ఫోన్‌లో ‘కంటిన్యూ’ నొక్కితే స్కానర్ ఓపెన్ అవుతుంది. కొత్త ఫోన్‌లోని క్యూఆర్ కోడ్‌ను పాత ఫోన్ స్కానర్‌తో స్కాన్ చేయాలి. మీ వాట్సాప్ చాట్ డేటా సైజును బట్టి కొంత సమయం తీసుకుంటుంది. ట్రాన్స్‌ఫర్ పూర్తయిన వెంటనే పాత ఫోన్‌లోని వాట్సాప్ ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోయి, ఒక్క మెసేజ్ కూడా పోకుండా మీ పాత చాట్స్ అన్నీ కొత్త మొబైల్‌లోకి విజయవంతంగా వచ్చేస్తాయి.