Homemade Sesame Oil: త్వరలోనే నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ పండుగ రోజుల్లో ఇంట్లో పూజా పునస్కారాలతో పాటు వంటల విషయంలోనూ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. చాలామంది ఇళ్లలో అమ్మవారి పటాల ముందు దీపారాధన (జ్యోతి) వెలిగించడానికి నువ్వుల నూనెను వాడతారు. అలాగే ఉపవాసాలు చేసేవారు, రోజువారీ వంటల్లో కూడా ఈ నూనెను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్‌లో కొనే కల్తీ నూనెల కంటే, మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నువ్వుల నూనెను తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? పైగా ఈ నూనె తీసిన తర్వాత మిగిలే పిప్పి (ఖల్)ని కూడా వేస్ట్ చేయకుండా రుచికరమైన మిఠాయిలు చేసుకోవచ్చు, అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఏలాంటి మెషిన్ల అవసరం లేకుండా, కేవలం మన ఇంట్లోని వస్తువులతోనే నువ్వుల నూనెను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పద్ధతిలో నువ్వులను ముందుగా కాస్త వేయించి, రుబ్బి, నూనెను వేరు చేస్తాం. ఇలా చేస్తే అద్దంలా తళతళలాడే స్వచ్ఛమైన, మంచి సువాసనగల నువ్వుల నూనె తయారవుతుంది. పండుగ రోజుల్లో వంటలకే కాకుండా పూజలో దీపారాధనకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఇందుకోసం ముందుగా మంచి నాణ్యత కలిగిన ఒక 750 గ్రాముల పొట్టు తీయని నువ్వులను తీసుకోండి. పొట్టు తీసినవి వాడితే నూనె తీశాక మిగిలే పిప్పి సరిగ్గా ఉపయోగపడదు. ఈ నువ్వులను నీళ్లతో శుభ్రంగా కడిగి, ఒక పాత్రలో వేసి అవి పూర్తిగా మునిగేలా నీళ్లు పోయాలి. ఇలా ఒక 2 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లన్నీ పోయేలా జల్లెడలో వేసి ఒక 15-20 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు ఒక పెద్ద బాణలిలో ఈ నువ్వులను వేసి మీడియం మంటపై తిప్పుతూ వేయించాలి. నువ్వుల్లోని తేమ అంతా పోయిన తర్వాత మంటను సన్నగా పెట్టాలి. నువ్వులు చిటపటలాడుతూ, స్వల్పంగా రంగు మారే వరకు వేయించాలి. గుర్తుంచుకోండి.. నువ్వులను ఎక్కువ వేయించకూడదు! ఎక్కువ వేయించేస్తే నూనె చేదుగా మారుతుంది, అంతేకాకుండా దానితో చేసే స్వీట్ రుచి కూడా పాడవుతుంది.
దించిన తర్వాత నువ్వులను కాసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్‌లో వేసి మొదట డ్రైగా పొడి చేయాలి. ఆపై కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ కాస్త పల్చగా అవ్వడానికి అందులో 2-3 గ్లాసుల నీళ్లు కలిపి జల్లెడతో వడకట్టాలి. దీనివల్ల నువ్వుల పిప్పి వేరవుతుంది. మిగిలిన పిప్పిలో మళ్లీ ఒక లీటర్ నీళ్లు పోసి మరొకసారి మిక్సీ పట్టి, ఈసారి పల్చటి మల్మల్ గుడ్డతో వడకట్టాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక నువ్వుల పాలు (లిక్విడ్), పిప్పి వేర్వేరవుతాయి. ఇప్పుడు ఆ నువ్వుల పాల నుంచి నూనెను వేరు చేయాలి. దీనికోసం ఆ లిక్విడ్‌ను ఒక పాత్రలో పోసి మీడియం మంటపై వేడి చేయాలి. అది మరగడం ప్రారంభించగానే మంటను తగ్గించాలి. సన్నని మంటపై ఒక 10 నిమిషాలు ఉడికిస్తే, గిన్నె అంచుల వెంట నూనె తేలడం కనిపిస్తుంది. దానిని ఒక స్పూన్ సాయంతో తీసి వేరే పాత్రలో వేసుకోవాలి. ఇలా ప్రతీ 10 నిమిషాలకు సన్నని మంటపై ఉడికిస్తూ పైకి తేలిన నూనెను వేరు చేస్తూ ఉండాలి. మధ్యమధ్యలో కొద్దిగా ఐస్ వాటర్ (మంచు నీళ్లు) చల్లితే నూనె త్వరగా పైకి తేలుతుంది. ఇక నూనె రావడం ఆగిపోయే వరకు ఈ ప్రాసెస్ చేయవచ్చు.
అయితే, ఇలా వేరు చేసిన నూనెలో ఇంకాస్త తేమ, సన్నటి పిప్పి రేణువులు ఉంటాయి కాబట్టి అది ఇంకా స్వచ్ఛంగా ఉండదు. అందుకే ఆ నూనెను మళ్లీ చిన్న మంటపై వేడి చేయాలి. అడుగున ఉన్న పిప్పి మాడిపోకుండా చూసుకోవాలి. నూనెలోని తేమ తగ్గి, రేణువులు ముడుచుకోవడం మొదలయ్యాక గ్యాస్ ఆపేయాలి. నూనె కొద్దిగా చల్లారాక మల్మల్ గుడ్డ లేదా ఫిల్టర్ పేపర్‌తో వడకడితే చాలు.. స్వచ్ఛమైన, నమ్మకమైన, మంచి వాసనతో కూడిన నువ్వుల నూనె రెడీ! దీనిని శుభ్రమైన గ్లాస్ సీసాలో దాచి పెట్టుకోవచ్చు. ఇక, చివరగా, నూనె తీశాక మిగిలిన పిప్పిని పారేయాల్సిన అవసరం లేదు. అందులో ఇంకా కాస్త నూనె శాతం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న భాగాలుగా చేసి ఫ్రిజ్‌లో దాచుకుని స్వీట్లు చేసుకోవచ్చు. చలికాలంలో ఈ జిడ్డుగా ఉండే పిప్పిని వంటికి సున్నిపిండిలా (ఉబ్టన్) కూడా రాసుకోవచ్చు. అంటే నువ్వులలోని ప్రతి బొట్టునూ మనం సద్వినియోగం చేసుకోవచ్చన్నమాట!

