Petrol Consumption of Car with AC On: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కారులో ఏసీ వేసుకుంటున్నారు. ఎండా కాలంలో అయితే తప్పనిసరిగా ఏసీ ఆన్‌లో ఉండాల్సిందే. ఏసీ ఆన్‌లో ఉంచి కారును నడిపినప్పుడు మైలేజీపై ప్రభావం పడుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఏసీ వాడకం వల్ల ఎంత పెట్రోల్ ఖర్చవుతుంది? అని చాలామంది మదిలో మెదిలే ప్రశ్న. ఓ గంట పాటు కారులో ఏసీ ఆన్ చేస్తే.. ఎంత పెట్రోల్ అయిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏసీ ఆన్‌లో ఉన్నపుడు ఇంజిన్ సామర్థ్యంను బట్టి పెట్రోల్ ఖాళీ అవుతుంది. చిన్న కార్లు సాధారణంగా 1.2 నుండి 1.5 లీటర్ ఇంజిన్‌లను కలిగి ఉంటాయి. పెద్ద కార్లు 2.0 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఇంజిన్‌లను కలిగి ఉంటాయి. ఇంజన్ కెపాసిటీ ఎక్కువగా ఉన్న వాహనాల్లో ఏసీ ఆన్‌లో ఉన్నపుడు ఎక్కువ పెట్రోల్ ఖర్చవుతుంది. చిన్న కార్లలో ఒక గంట పాటు ఏసీ రన్నింగ్‌లో ఉంటే.. దాదాపు 0.2 నుండి 0.4 లీటర్ పెట్రోల్ ఖర్చవుతుంది. పెద్ద కార్లలో ఈ వినియోగం 0.5 నుండి 0.7 లీటర్ల వరకు ఉంటుంది.
కారును ఆపి ఏసీ ఆన్‌లో ఉంచినట్లయితే ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఏసీ ఆన్ చేసి.. అతి వేగంతో కారును నడిపినా లేదా ట్రాఫిక్ జామ్‌లో నెమ్మదిగా వెళ్లినా పెట్రోల్ వాడకం పెరిగిపోతుంది. అంతేకాదు ఏసీ సెట్టింగ్ కూడా తేడాను చూపుతుంది. ఫుల్లుగా ఏసీ పెట్టుకుంటే.. కంప్రెసర్ ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇంధన వినియోగం పెరుగుతుంది. కారు ఇంజిన్ పాతదైనా లేదా తక్కువ సామర్థ్యం కలిగి ఉన్నా ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుంది. వాహనం కండిషన్, ఇంజన్, ఏసీ కండిషన్ను బట్టి ఈ లెక్కలు ఉంటాయి.
ఏసీ ఆన్‌లో ఉంటే జేబుకి చిల్లు పడినట్లే. అందుకే ఏసీ అత్యవసరం అనిపించినప్పుడు మాత్రమే వాడటం మేలు. కారును నీడలో పార్క్ చేసుకోవాలి. వీలైనంతవరకూ కారు విండో డోర్లను ఓపెన్ చేస్తే.. బంతి నుంచే వచ్చే గాలితో ఎడ్జస్ట్ అవ్వొచ్చు. కారు టైర్లలో గాలి ఫుల్లుగా ఉండేలా చూసుకోవాలి. కారులో అనవసరమైన వస్తువుల్ని తొలగించాలి. అంతేకాదు కారును స్థిరమైన వేగంతో నడిపితే ఫ్యూయల్ వాడకం తగ్గుతుంది.