ఐపీఎల్ 2025 తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఐపీఎల్ నాకౌట్ చరిత్రలోనే బంతుల పరంగా అత్యంత భారీ విజయాన్ని ఆర్‌సీబీ ఖాతాలో వేసుకుంది. క్వాలిఫయర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 101 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆర్‌సీబీ 10 ఓవర్లలో రెండు వికెట్స్ మాత్రమే కోల్పోయి సునాయాస విజయం సాధించింది. ఇక ఎన్నో రోజులుగా వేచిచూస్తున్న ఐపీఎల్ టైటిల్‌కు ఆర్‌సీబీ అడుగు దూరంలో నిలిచింది. అయితే ఈసారి కప్పు ఆర్‌సీబీదే అని చరిత్ర చెబుతోంది.
క్వాలిఫయర్ 1లో విజేతగా నిలిచిన జట్టే అత్యధిక సార్లు ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2011లో ప్లేఆఫ్స్ పద్ధతి ప్రారంభం కాగా.. అప్పటి నుంచి 14 ఎడిషన్లలో 11 సార్లు క్వాలిఫయర్ 1 గెలిచిన జట్టే ఛాంపియన్‌గా నిలిచింది. గత సీజన్‌లో కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ క్వాలిఫయర్ 1 గెలిచి.. ఆ తర్వాత టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ ట్రెండ్ ప్రకారం.. ఐపీఎల్ 2025 విజేతగా ఆర్‌సీబీ నిలిచే అవకాశాలు ఉన్నాయి. చరిత్రతో పాటు ఆర్‌సీబీ ఈ సీజన్ అంతటా అత్యుత్తమ క్రికెట్ ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది. ఒకరిద్దరిపై ఆధారపడకుండా.. జట్టుగా ఆడింది.
ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సీబీ నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. 2009, 2011, 2016లో ఫైనల్ వెళ్లినా.. కప్‌ను మాత్రం కైవసం చేసుకోలేదు. 2025లో నాలుగోసారి ఫైనల్‌కు వచ్చింది. 2020 నుంచి ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ చేరుతున్నా.. ఫైనల్‌కు మాత్రం చేరలేదు. చరిత్ర, ప్రస్తుత ఆట చూస్తే.. ఈసారి కప్ ఆర్‌సీబీదే అని ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
