Site icon NTV Telugu

Mizoram: జయహో నారీమణి.. చిన్న వయసులో స్పీకర్‌గా ఎన్నిక

Assembly Speaker

Assembly Speaker

మిజోరం (Mizoram) అసెంబ్లీ చరిత్రలో చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. తొలిసారి ఒక మహిళ, అది కూడా పిన్న వయస్కురాలైన వన్నెహసాంగి (Baryl Vanneihsangi) శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె స్పీకర్ చైర్‌లో ఆసీనులయ్యారు. దీంతో మిజోరం హిస్టరీలో ఆమె ఒక చరిత్ర సృష్టించింది.

మిజోరాం రాష్ట్ర అసెంబ్లీలో 40 మంది సభ్యులున్నారు. మొట్టమొదటి సారిగా ఓ మహిళ స్పీకర్‌గా నియమితులయ్యారు. జోరెమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ నాయకురాలు, ఎమ్మెల్యే బారిల్ వన్నెహసాంగి మార్చి 7న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ స్థానాన్ని అధిష్టించారు.

మిజోరాం అసెంబ్లీకి ఇది ఒక ముఖ్యమైన చారిత్రక మైలురాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి, జోరెమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ అగ్రనేత లాల్దుహోమా చెప్పుకొచ్చారు. సాంప్రదాయ పరిమితులను దాటుకుని రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు ఇదొక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో జోరెమ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌కి చెందిన వన్నెహసంగి ఒకరు. మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి ఎఫ్. లాల్నున్మావియాపై ఆమె 9,370 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా కూడా 32 ఏళ్ల వన్నెహసాంగి చరిత్ర సృష్టించారు.

ప్రస్థానమిది..
రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకముందు వన్నెహసాంగి ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా పనిచేశారు. ఇక మేఘాలయలోని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ నుంచి ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం ఆమె ఓ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేశారు.

Exit mobile version