NTV Telugu Site icon

James Anderson: అండర్సన్‌ హిస్టరీ.. 21 ఏళ్లుగా వికెట్ల వేటలో!

14

14

జేమ్స్ అండర్సన్.. ఇంగ్లాండ్ క్రికెట్‌లోనే కాదు ప్రపంచ క్రికెట్‌లోనే చరిత్రలో నిలిచిపోయే పేసర్. వయసు పెరుగుతున్నా కొద్దీ ఇతడి పేస్‌లో పదును పెరుగుతుందే తప్ప తరగడం లేదు. తన బౌలింగ్‌తో ఇప్పటికే ఎన్నో పురస్కారాలు, మరెన్నో రికార్డులు ఖాతాలో వేసుకున్న జిమ్మీ​.. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్టులో మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టిన అండర్సన్‌.. గడిచిన 21 ఏళ్లలో ఏడాదికి కనీసం ఒక వికెటైనా తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన 40 ఏళ్ల ఆండర్సన్‌.. నాటి నుంచి ప్రతి ఏడాది కనీసం ఒక్క వికెట్ అయినా తీశాడు. ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంక్‌లో ఉన్న అండర్సన్‌ టెస్టు క్రికెట్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Also Read: Bollywood: సూపర్ మాన్ Vs బాట్ మాన్; ఐరన్ మాన్ Vs కెప్టెన్ అమెరిక; టైగర్ Vs పఠాన్

ఇప్పటికే 178 టెస్టుల్లో 677 వికెట్లు తీసి ఓవరాల్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఆండర్సన్‌.. వన్డేల్లో ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక వికెట్లు (194 వన్డేల్లో 269) పడగొట్టిన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. అలాగే టెస్టుల్లో సచిన్‌ (200) తర్వాత అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్‌గా, ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్‌గా, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 1000 వికెట్లు పడగొట్టిన 216వ బౌలర్‌గా, ఇంగ్లాండ్‌ తరఫున ఈ ఫీట్‌ సాధించిన తొలి బౌలర్‌గా పలు రికార్డులు నెలకొల్పాడు.

వన్డే తరహాలో..

ఇకపోతే, న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌.. రాకెట్‌ వేగంతో పరుగులు సాధించింది. పేరుకు టెస్టు మ్యాచ్ అయినా వన్డే బ్యాటింగ్‌తో ఇంగ్లీష్ బ్యాటర్లు రెచ్చిపోయారు. మొదటి రోజు కేవలం 58,2 ఓవర్లే ఆడిన ఇంగ్లాండ్ 325/9 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. బెన్‌ డకెట్ (68 బంతుల్లో 84), హ్యారీ బ్రూక్‌ (81 బంతుల్లో 89) మెరుపు అర్ధశతకాలు సాధించి తృటిలో సెంచరీలు చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఓలీ పోప్‌ (42), బెన్‌ ఫోక్స్‌ (38) కూడా బౌండరీలతో విరుచుకుపడి జట్టు వేగంగా పరుగులు సాధించడానికి దోహదపడ్డారు. కివీస్‌ బౌలర్లలో వాగ్నర్‌ 4, సౌథీ, కుగ్గెలెన్‌ చెరో 2, టిక్నర్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కివీస్‌.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. కాన్వే (17), వాగ్నర్‌ (4) క్రీజ్‌లో ఉన్నారు. లాథమ్ (1), విలియమ్సన్ (6), నికోలస్ (4) నిరాశపర్చారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు కావాల్సినంత సమయం ఉండి, చేతిలో వికెట్‌ ఉన్నప్పటికీ మొదటి రోజే తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Also Read: Prithvi Shah: పృథ్వీనే యువతిపై దాడి చేశాడు: యంగ్ క్రికెటర్‌ దాడి కేసులో ట్విస్ట్