Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!

Ganga Aarti In London

Ganga Aarti In London

Ganga Aarti in London: లండన్‌లో చారిత్రాత్మక ఆధ్యాత్మిక వేడుక జరిగింది. భారతదేశంలో గంగా నది తీరంలో సంప్రదాయంగా నిర్వహించే గంగా హారతిని తొలిసారిగా బ్రిటన్‌లోని థేమ్స్ నది తీరంలో నిర్వహించారు. సెప్టెంబర్ 13 (ఆదివారం) జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరై భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను ఘనంగా జరుపుకున్నారు.

‘గంగా హారతి ఆన్ ది థేమ్స్: ఎ సెరిమనీ ఆఫ్ లైట్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చిన్మయ మిషన్ యూకే, వార్షిక టోటల్లీ థేమ్స్ ఫెస్టివల్‌తో కలిసి నిర్వహించింది. భారతీయ ప్రవాసులు, భక్తులు, స్థానికులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు.

భారత్‌లో గంగా నది తీరంలో పవిత్ర గంగమ్మకు ప్రార్థనలు చేస్తూ దీపాలను సమర్పించడం గంగా హారతి సంప్రదాయం. అదే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని థేమ్స్ నది ఒడ్డున నిర్వహించడం ద్వారా భారత్, బ్రిటన్ మధ్య ఉన్న సాంస్కృతిక బంధానికి ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా.. సంప్రదాయ ప్రార్థనలు, భక్తి గీతాలు, మంత్రోచ్ఛారణలతో పాటు దీపాలను వెలిగించి నదికి హారతి ఇచ్చారు. థేమ్స్ నది తీరంలో వేలాది మంది ఒకేచోట చేరడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.

చారిత్రాత్మక ఓల్డ్ రాయల్ నేవల్ కాలేజ్, గ్రీన్‌విచ్ నేపథ్యంగా ఈ వేడుక జరిగింది. భారతీయ సంప్రదాయాలను లండన్‌లో ప్రదర్శించడంతో పాటు.. గంగా నదితో ముడిపడిన ఆధ్యాత్మిక భావనను బ్రిటన్‌లోని భారతీయ ప్రవాసులు, ఇతర సమాజాలకు పరిచయం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం.

బ్రిటన్‌లోని అత్యంత ప్రసిద్ధ నదుల్లో థేమ్స్ ఒకటి. లండన్ నగర చరిత్ర, అభివృద్ధితో ఈ నదికి విడదీయరాని సంబంధం ఉంది. థేమ్స్ అనే పేరు పురాతన సెల్టిక్ పదమైన ‘టామెసాస్’ నుంచి వచ్చిందని చెబుతారు. గంగా, థేమ్స్ రెండూ తమ తమ ప్రాంతాల నాగరికత, సంస్కృతిపై గణనీయమైన ప్రభావం చూపిన నదులు. ఈ నేపథ్యంలో థేమ్స్ తీరంలో తొలిసారిగా గంగా హారతి నిర్వహించడం రెండు సంస్కృతుల మధ్య ప్రతీకాత్మక వారధిగా నిలిచింది. భారతీయ సంప్రదాయాల వైభవాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్పే అరుదైన ఘట్టంగా ఈ కార్యక్రమం నిలిచింది.