Site icon NTV Telugu

Hindenburg: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరో బాంబు.. ట్విటర్ మాజీ సీఈవోపై సంచలన రిపోర్టు

Hindenburg

Hindenburg

Hindenburg: అదానీ గ్రూప్‌పై గత జనవరిలో సంచలన ఆరోపణలు చేసిన యూఎస్‌ షార్ట్‌ షెల్లర్‌ సంస్థ హిండెన్‌ బర్గ్‌ రీసెర్చ్‌ మరో సంచలన ప్రకటన చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్స్ తన బాంబును ఈ సారి ట్విటర్ మాజీ సీఈవో జాక్‌ డోర్సేపై వేసింది. జాక్ డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ బ్లాక్ ఇంక్‌ భారీ అక్రమాలకు పాల్పడిందని గురువారం తెలిపింది. దీనికి సంబంధించిన నివేదికను ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గురువారం ప్రకటించిన రిపోర్టులో జాక్ డోర్సే నేతృత్వంలోని బ్లాక్‌ సంస్థ అక్రమాలను బయట పెట్టింది. తమ రెండేళ్ల పరిశోధనలో కీలక విషయాలను గుర్తించినట్టు హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్ తన వెబ్‌సైట్‌లో ప్రచురించిన నోట్‌లో పేర్కొంది. ముఖ్యంగా తన కస్టమర్లను ఎక్కువగా చూపించి వారి ఖర్చులను తక్కువ చేసిందని ఆరోపించింది. తన ఫేక్‌ లెక్కలు,నకిలీ కస్టమర్ల సంఖ్యతో పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడమే బ్లాక్ వ్యాపారం వెనుకున్న మాయాజాలం అని వ్యాఖ్యానించింది. తాము సమీక్షించిన ఖాతాల్లో 40 శాతం నుండి 75 శాతం నకిలీవని, మోసానికి పాల్పడినవీ లేదా ఒకే వ్యక్తితో ముడిపడి ఉన్న అదనపు ఖాతాలని వెల్లడించింది. కాగా 2009లో ఏర్పాటైన బ్లాక్‌ సంస్థ మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. ఈ నివేదిక తర్వాత ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో బ్లాక్ షేర్లు 18 శాతం కుప్పకూలడం గమనార్హం.

Read Also: India Slams Pak: ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్‌పై వ్యాఖ్యానించిన పాక్‌.. మండిపడిన భారత్

గత జనవరి 24న హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక వెల్లడైనప్పటి నుంచి అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ సంస్థల షేర్లు భారీగా పతనం అయ్యాయి. అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 140 బిలియన్‌ డాలర్లకు పైగా కొడిగట్టుకుపోయింది. అప్పటి వరకు గ్లోబల్‌ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగిన గౌతం అదానీ వ్యక్తిగత సంపద కూడా భారీగా హరించుకపోయింది.

Exit mobile version