ఇటీవలికాలంలో బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆ ఊబిలో చిక్కుకున్న తర్వాత బయటకు రాలేకపోతున్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ ఎలా మోసాలు చేస్తున్నాయి.. వాటి నుంచి బయట పడాలంటే ఏం చేయాలి.. లాంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి ప్రపంచంలోని సమస్త సమాచారం ఎప్పుడూ అరచేతిలో ఉంటోంది. దీన్నే ఆసరాగా చేసుకుని కొంతమంది యాప్స్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మన దేశంలో బెట్టింగ్ యాప్స్ విపరీతంగా పెరిగాయి. ఈ యాప్‌లు సాధారణంగా క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్ వంటి క్రీడలకు సంబంధించినవై ఉంటున్నాయి. మరికొన్ని రమ్మీ, క్యాసినో, పోకర్ వంటి ఆటలను అందిస్తాయి. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా అకౌంట్ సృష్టించి డబ్బు జమ చేసి ఈ గేమ్స్ ఆడతారు.
బెట్టింగ్ యాప్స్ కూడా చూడ్డానికి చాలా సాధారణ గేమ్ యాప్స్ లాగే కనిపిస్తాయి. అందుకే వీటి మాయాలోకంలోకి ఈజీగా వెళ్లిపోతున్నారు ఔత్సాహికులు. బెట్టింగ్ యాప్స్ లోకి ప్రవేశించడం చాలా సులభం. ఎలాంటి నియంత్రణలూ లేవు. అందుకే స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న వారందరికీ ఈ యాప్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఈ యాప్స్ లోకి వెళ్లాలనుకునేవాళ్లు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ ఉంటే చాలు రిజిస్ట్రేషన్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు. ఆ తర్వాత గేమ్ ఆడాలంటే ఎంతోకొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోరుతాయి. మన బ్యాంక్ అకౌంట్, లేదా యూపీఐ ద్వారా వినియోగదారులు యాప్ అకౌంట్ లోకి డబ్బును బదిలీ చేస్తారు. అప్పుడు అసలు ఆట మొదలవుతుంది. ఆట ఆడేటప్పుడు విన్నింగ్ అవకాశాల ద్వారా కస్టమర్లు బెట్టింగ్ చేస్తారు. గెలిస్తే భారీ మొత్తంలో డబ్బు ఇస్తామని ఆశ పెడతారు. డబ్బు గెలిస్తే క్షణాల్లో మీ అకౌంట్లోకి డబ్బు జమ అవుతుందని ప్రచారం చేస్తారు. కానీ చాలా సందర్భాల్లో ఇది జరిగదు.
బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోయిన వారిని మనం నిత్యం ఎంతోమందిని చూస్తూనే ఉన్నాం. అసలు బెట్టింగ్ యాప్స్ ఎన్నిరకాలుగా మోసం చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. యాప్స్ క్రియేట్ చేసే వాళ్లు వివిధ రకాలుగా వాటిని సృష్టిస్తారు. అందులో మొదటిది ఫేక్ గేమ్ యాప్స్. ఇందులో ఆటను ముందే ప్రోగ్రామింగ్ చేసి ఉంటారు. ఇందులో కస్టమర్లు ఎవరూ ఆటను గెలవలేరు. కాబట్టి పెట్టిన డబ్బంతా వెళ్లిపోతుంది. రెండోది బోనస్ మాయాజాలం. ఇందులో పెద్ద మొత్తంలో బోనస్ వస్తుందని ఊరిస్తారు. ఎక్కువ మొత్తంలో డిపాజిట్లు చేయాలని కోరతారు. డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత వివిధ కారణాలతో బోనస్ ఇవ్వకుండా అసలుకే మోసం చేస్తారు. మూడోది డేటా దుర్వినియోగం. యాప్స్ లో అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడ మనం మన సమాచారాన్ని మొత్తం అందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మెయిల్, ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్.. ఇలాంటివన్నీ ఇచ్చేసిన తర్వాత వాటిని హ్యాక్ చేసి మన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మన సమాచారాన్ని ఇతరులకు అమ్మేసి సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఇక నాలుగోది విత్ డ్రాయల్ చీటింగ్స్- ఇందులో వినియోగదారులు గెలిచినా కూడా డబ్బు ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం లేకుండా బ్లాక్ చేసేస్తారు. ఐదోది యాప్ సడెన్ గా డౌన్ అవడం – అకౌంట్ క్రియేట్ చేసుకుని డబ్బు డిపాజిట్ చేసిన వెంటనే ఇక ఆ యాప్ పనిచేయడం మానేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వర్కవుట్ కాదు. ఇక ఆరోది కౌంటర్ బెట్స్- కొంతమంది వినియోగదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేస్తుంటారు. ఫలానా దానిపైన డబ్బు పెడితే కచ్చితంగా డబ్బు వస్తుందని నమ్మిస్తారు. అలా చెప్పినందుకు కమిషన్ తీసుకుంటారు. చివరకు ఓడించి డబ్బు దండుకుంటారు.
బెట్టింగ్ యాప్స్ మాయాజాలంలో పడి మోసపోవడానికి సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు కూడా ఓ కారణం. చాలా మంది ఇన్ ఫ్లుయెన్సర్లు డబ్బుకోసం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ఇన్ ఫ్లుయెన్సర్లు పుట్టుకొచ్చారు. వాళ్ల ఫాలోయర్లను అడ్డంగా పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. వీళ్లు 4 రకాలుగా జనాన్ని మోసం చేస్తున్నారు. అందులో మొదటిది ఫేక్ ప్రమోషన్ – కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని.. నిజమని నమ్మించేలా వీడియోలు తయారు చేస్తారు.. లేదంటే పోస్టులు పెడతారు.. బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తారు. ఇక రెండోది సక్సెస్ స్టోరీలు- ఇందులో “నేను ఇలా లక్షలు గెలుచుకున్నాను” మీరు కూడా ఇలా చేస్తే నాలాగా డబ్బు గెలుచుకోవచ్చు అని ప్రచారం చేస్తారు. కస్టమర్లను ఆకర్షిస్తారు. ఇక మూడోది లింక్ మాయాజాలం- కొంతమంది ఫేక్ ఇన్ ఫ్లుయెన్సర్లు ఏదో ఒక పోస్ట్ పెట్టి కింద ఉన్న లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వాలని కోరుతుంటారు. అలా లింక్ క్రియేట్ చేస్తే అవి నకిలీ వెబ్ సైట్లకు దారి తీస్తాయి. ఆ లింక్ క్లిక్ చేయగానే మన ఫోన్ లోని సమాచారాన్ని వాళ్లు దోచేస్తుంటారు. ఇక నాలుగోది ఫేక్ గ్యారంటీ- ఇందులో ఇన్ ఫ్లుయెన్సర్లు నాతో కలిస్తే మీకు వంద శాతం గెలుపు గ్యారంటీ అని నమ్మిస్తారు. ఇందుకోసం కొంత మొత్తాన్ని సబ్ స్క్రిప్షన్ పేరిట వసూలు చేస్తారు. ఇటీవలికాలంలో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న కొంతమంది సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను పోలీసులు అరెస్టు కూడా చేశారు.
బెట్టింగ్ యాప్స్ ప్రభావం మనిషి జీవితంపై చాలా ప్రభావం చూపిస్తోంది. ఒకసారి ఈ ఊబిలో చిక్కుకున్న వాళ్లు బయటక రావడం చాలా కష్టంగా మారుతోంది. బెట్టింగ్ యాప్‌లు వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబం పైన కూడా తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. చాలా మంది లక్షలాది రూపాయలు కోల్పోయి అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. బయటపడే మార్గం తెలీక మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. డబ్బు నష్టపోయినందున కుటుంబాల్లో గొడవలు అవుతున్నాయి. కొంతమంది విడాకుల వరకూ వెళ్తున్నారు. యాప్స్ ద్వారా డబ్బు పోగొట్టుకున్న వాళ్లు.. ఆ నష్టాలను పూడ్చుకునేందుకు దొంగతనాలకు పాల్పడుతున్నారు. మర్డర్లు చేస్తున్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడడం ద్వారా మరిన్ని ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారు.
Also Read: Champions Trophy 2025: అతడే అసలైన హీరో.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ ఇవ్వాల్సింది: అశ్విన్
మరి ఈ బెట్టింగ్ యాప్స్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలి..? బెట్టింగ్ యాప్స్ నుంచి బయటపడాలంటే మనం 6 విషయాలను గుర్తుంచుకోవాలి. మొదటిది- ఆయా యాప్ లు నిజమైనవో కావో నిర్ధారించుకోవాలి. లైసెన్స్ ఉందా, రిజిస్టర్ అయిందో లేదో తెలుసుకోవాలి. చట్టబద్ధంగా ఆ యాప్ పనిచేస్తుందో లేదో కనుక్కోవాలి. రెండోది- వెరిఫైడ్ యూజర్ రివ్యూలను చదవాలి. వినియోగదారుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆ యాప్ కరెక్టో కాదో తెలుసుకోవచ్చు. మూడోది- ఎప్పుడైనా యాప్స్ లో గేమ్స్ ఆడాలనుకుంటే యాప్ నిజమైనదే అని నిర్ధారించుకున్న తర్వాత తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి మాత్రమే ఆడాలి. ఒకసారి ఓడిపోతే వెంటనే దాని నుంచి బయటకు వచ్చేయాలి. నాలుగోది- ఏదైనా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటే అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఐదోది – OTP లేదా పర్సనల్ డేటాను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఇలాంటి వివరాలు అడిగే యాప్‌లను వెంటనే ఇగ్నోర్ చేయాలి. ఇక ఆరోది- ఎవరైనా గెలుపు గ్యారెంటీ అని చెబితే అలాంటి వాళ్లతో అప్రమత్తంగా ఉండండి. బెట్టింగ్‌లో గ్యారెంటీ అనేది ఉండదు. లాభం అనే మాటే ఎరుగరు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.
బెట్టింగ్ యాప్స్ విషయంలో మన దేశంలో ఒక్కో రాష్ట్రం తీరు ఒక్కోలా ఉంది. కాబట్టి వీటిని నియంత్రించడం కష్టతరంగా మారిందని చెప్పొచ్చు. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్, 1867 ప్రకారం ఆన్లైన్ గ్యాంబ్లింగ్ చాలా ప్రాంతాల్లో చట్టవిరుద్ధం. మన దేశంలో కొన్ని రాష్ట్రాలు బెట్టింగ్ యాప్స్ ను పూర్తిగా నిషేధించాయి. అక్కడ బెట్టింగ్ యాప్స్ అందుబాటులో ఉండవు. అయితే కొన్ని యాప్‌లు విదేశీ లైసెన్స్ ద్వారా మన దేశంలో పని చేస్తున్నాయి. వీటిని నియంత్రించడం అసాధ్యం. అందుకే చాలా మంది బెట్టింగ్ యాప్స్ మాయలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
మరి బెట్టింగ్ యాప్స్ మాయలో పడి మోసపోతే ఏం చేయాలి..? తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోతే వెంటనే … సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in/ అనే వెబ్ సైట్ కు వెళ్లి ఫిర్యాదు చేయండి. లోకల్ పోలీస్ స్టేషన్ లేదా న్యాయసహాయ సంస్థలు అంటే Consumer Courtలను కూడా ఆశ్రయించవచ్చు. అలాగే.. మన అకౌంట్ నుంచి అమౌంట్ దొంగలించబడితే వెంటనే బ్యాంక్ కు వెళ్లి అకౌంట్ ను బ్లాక్ చేయించుకోవాలి. లేకుంటే మరింత నష్టం జరగవచ్చు. పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోతే సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ ను ఆశ్రయించడం మంచిది.
చూశారుగా.. బెట్టింగ్ యాప్స్ ఎన్ని రకాలుగా మాయ చేస్తున్నాయో..! కాబట్టి వీటి నుంచి బయట పడాలంటే అప్రమత్తంగా ఉండడం ఒక్కటే మార్గం. ఆన్ లైన్ యాప్స్ మనకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వవు. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి. అలా కాకుండా అత్యాశకు పోయే వాళ్లే ఎక్కువగా ఇలాంటి యాప్స్ ద్వారా మోసపోతున్నారు. జీవితాలను పోగొట్టుకుంటున్నారు.