IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్

Imd

Imd

IMD Weather Alert: రాష్ట్రాలను మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ మరింత బలపడటంతో రానున్న రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. తెలంగాణ, కేరళ రాష్ట్రాలపై ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఐసోలేటెడ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎమ్‌డీ మల్టీ-డే వార్నింగ్ జారీ చేసింది.

మరోవైపు కేరళలో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరిలు విరిగిపడటం, బురద మేటలేయడం (ముడ్ స్లైడ్స్), ఉవ్వెత్తున ఎగిసిపడిన ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర అలజడి సృష్టించాయి. ఈ వర్షాల దాటికి ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గల్లంతయ్యారని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. వర్షాల తీవ్రత పెరుగుతుండటంతో పరిస్థితిని గంట గంటకూ సమీక్షించాలని ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్ అధికారులను ఆదేశించారు. దీనిపై విపత్తు నిర్వహణ అథారిటీ కమిషనర్ విఘ్నేశ్వరి ఐఏఎస్.. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల కలెక్టర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి ముందుస్తు జాగ్రత్తలను సమీక్షించారు. ప్రజలకు ఎస్ఎమ్‌ఎస్ అలర్ట్‌లు పంపడంతో పాటు, అవసరమైన చోట ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు.

వర్షాల ధాటికి ఇడుక్కి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొట్టకంబూర్ సమీపంలోని అమ్మన్ కోవిల్ ప్రాంతంలో వర్షం నుంచి బ్రతకడానికి ఒక పొలంలో ఉన్న షెడ్డులోకి ముగ్గురు వెళ్లారు. అయితే అకస్మాత్తుగా భారీగా బురద విరిగిపడి ఆ షెడ్డుపై పడటంతో అది కూలిపోయి ముగ్గురు లోపల చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో బాలకృష్ణన్ (40), చిన్నూ (36) అనే ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, బాలకృష్ణన్ భార్య మరియమ్మ తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది. ఆ ప్రాంతంలో తవ్విన మట్టిని అక్కడే కుప్పగా పోయడం, దానికి తోడు భారీ వర్షం పడటమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.