Site icon NTV Telugu

Coal Mines: సత్తుపల్లిలో భారీ వర్షం.. బొగ్గు గనుల్లో ఉత్పత్తికి అంతరాయం

Coal

Coal

Coal Mines: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో కురిసిన భారీ వర్షం బొగ్గు గనుల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించింది. ఈ వర్షం ప్రభావంతో జే.వి.ఆర్. ఓసి (JVROC), కిష్టారం ఓసి (Kishtaram OC)లల్లో బొగ్గు ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయింది. వరద నీరు గనుల్లోకి చేరడంతో మట్టి వెలికితీతతో పాటు బొగ్గు తవ్వకాల్లో సమస్యలు ఏర్పడ్డాయి. జేవిఆర్ ఓసి గనిలో రోజుకు సగటున 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. అలాగే సుమారు 50,000 క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీయాల్సిన పనులు ఉన్నాయి. అయితే, వరదనీరు చేరడం వల్ల ఈ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. జలదిగ్బంధానికి గురైన బొగ్గు బ్లాక్‌లు పూర్తిగా తడిగా మారి, వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

Read Also: Mancherial: మంచిర్యాలలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు..

మరోవైపు కిష్టారం ఓసిలో రోజుకు సుమారు 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. అలాగే 20,000 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వే పనులు జరుగుతున్నాయి. భారీ వర్షానికి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడింది. వరదనీరు ప్రవేశించడంతో పనులు అటకెక్కాయి. ఉపరితల గనుల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు గనిలో పని చేసే కార్మికులు మోటర్ల సహాయంతో నీటిని వెలుపలికి తోడుతున్నారు. సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. ఈ భారీ వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తిలో తీవ్రంగా అంతరాయం ఏర్పడటంతో కంపెనీకి ఆర్థికంగా కొద్దిమేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Exit mobile version