Heart Health in Winter: గుండె జబ్బులు ఉన్నవారు శీతాకాలంలో ఈ ఆహారాలను దూరంగా పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. శీతాకాలం వచ్చిందంటే చాలా మందికి వేడి, రుచికరమైన ఆహారాలే గుర్తుకు వస్తాయి. చలిని తట్టుకోవడానికి అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర ఉన్న వంటకాలను ఎక్కువగా తీసుకోవడం సాధారణంగా జరుగుతుంది. అయితే ఇదే అలవాటు గుండె ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలి వాతావరణం గుండెపై అదనపు భారం పెడుతుంది. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా రక్తనాళాలు సంకుచితమై రక్తపోటు పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక సోడియం ఉన్న ఆహారం తీసుకుంటే గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు లేదా మధుమేహం ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు..
1. చలి తగ్గుతుందనే ఉద్దేశంతో మద్యం సేవించడం
శీతాకాలంలో మద్యం తాగితే శరీరం వేడిగా ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ, వాస్తవానికి ఇది తాత్కాలిక వేడి మాత్రమే ఇస్తుంది. దీర్ఘకాలంలో రక్తపోటును పెంచడం, గుండె లయను అస్థిరం చేయడం మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచడం ద్వారా గుండెకు హాని చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
2. ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన మాంసాహారం
మటన్, బీఫ్ కర్రీలు, సాసేజ్‌లు, బేకన్ వంటి ఆహారాలు శీతాకాలంలో ఎక్కువగా తింటారు. ఇవి కొవ్వులు మరియు ఉప్పు అధికంగా కలిగి ఉండటం వల్ల రక్తపోటు పెరిగి గుండెపోటు ప్రమాదం అధికమవుతుంది. ప్రాసెస్ చేసిన మాంసంలో ఉండే రసాయనాలు రక్తనాళాలకు నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు.
3. నెయ్యి, వెన్న, క్రీమ్ ఎక్కువగా వాడిన వంటకాలు
శీతాకాలపు వంటల్లో రుచికోసం నెయ్యి, వెన్న లేదా మలై అధికంగా వాడుతారు. మితంగా తీసుకుంటే ఇబ్బంది లేదు.. కానీ, అధిక వినియోగంతో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను పెంచి గుండె జబ్బులకు కారణమవుతుంది.
4. శీతాకాల మిఠాయిలు, స్వీట్లు
లడ్డూలు, హల్వాలు, ఇతర స్వీట్లు శుద్ధి చేసిన పిండి, చక్కెర మరియు హైడ్రోజనేటెడ్ కొవ్వులతో తయారవుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి.. ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి, ఇది గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం.
5. ఇన్‌స్టంట్ సూప్‌లు, రెడీ టు ఈట్ ఆహారాలు
చలి రోజుల్లో సులభంగా తయారయ్యే ప్యాకెట్ ఆహారాలు ఆకర్షణీయంగా అనిపిస్తాయి. కానీ, వీటిలో సోడియం మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక ఉప్పు వల్ల రక్తపోటు పెరిగి గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదం అధికమవుతుంది.
6. షుగర్ కలిపిన వేడి పానీయాలు
వేడి చాక్లెట్, ఫ్లేవర్డ్ కాఫీ, తీపి టీలు శీతాకాలంలో సాధారణంగా తీసుకుంటారు. వీటిలోని అధిక చక్కెర వాపు, ఊబకాయం మరియు గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.
7. ఊరగాయలు, ఎక్కువకాలం నిల్వ చేసే ఆహారం
ఉప్పు మరియు నూనె అధికంగా ఉండే ఊరగాయలను తరచూ తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది ధమనులు గట్టిపడటానికి కారణమై గుండెపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
మరి శీతాకాలంలో గుండెకు మేలు చేసే అలవాట్లు ఏంటి అనే విషయానికి వస్తే.. గుండె ఆరోగ్యం కేవలం ఏం తింటున్నామనే విషయంతోనే కాకుండా ఎంత మోతాదులో, ఎంత తరచుగా తింటున్నామన్నదానిపై కూడా ఆధారపడి ఉంటుంది. శీతాకాలంలో శారీరక చురుకుదనం తగ్గడం వల్ల ఆహారంపై మరింత నియంత్రణ అవసరం. కాలానుగుణ కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు, గింజలను మితంగా తీసుకోవడం, తక్కువ నూనె–ఉప్పుతో ఇంట్లో వండిన వెచ్చని భోజనం గుండెకు మేలు చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ లేదా రక్తపోటు ఉన్నవారు శీతాకాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు చేసేముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
