Cellphones & Brain Cancer New Study: ప్రస్తుతం ఎక్కడ చూసినా స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు వినియోగిస్తున్నారు. ఇంటి నుంచి ఆఫీసు వరకు ఎక్కడ చూసినా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వాడుతూనే కనిపిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడం వల్ల మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చాలా మంది అనుకుంటారు. అయితే, ఇప్పుడు దీనికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చేసిన అధ్యయనం వెలుగులోకి వచ్చింది.. బ్రెయిన్ క్యాన్సర్‌కి, మొబైల్ ఫోన్ వాడకానికి ప్రత్యక్ష సంబంధం లేదని ప్రకటించింది. ప్రతి రోజు అతిగా మొబైల్ ఫోన్ల వాడకం వల్ల మనుషుల్లో బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. సెల్ ఫోన్ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. 1994 – 2022 మధ్య ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల నుండి రేడియేషన్, క్యాన్సర్, ఇతర రంగాలలో నిర్వహించిన 63 అధ్యయనాలను డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలో 11 మంది నిపుణులు విశ్లేషించారు. ఇందులో ఆస్ట్రేలియన్ ప్రభుత్వం రేడియేషన్ ప్రొటెక్షన్ అథారిటీ కూడా ఉంది. అనంతరం ఒక నివేదికను సమర్పించారు. దీనిని ‘ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్’ జర్నల్ ప్రచురించింది.
Read Also:Simbaa OTT: ఓటీటీలోకి అనసూయ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రోజూ ఎక్కువ సేపు ఫోన్లు వాడే వారితో పాటు దశాబ్ద కాలంగా ఫోన్లు వాడుతున్న వారిలో బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని నివేదికలో నిపుణులు స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లు, టీవీలు, రాడార్లు, ఇతర పరికరాల నుంచి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ స్థాయిలు డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన భద్రతా స్థాయిల కంటే తక్కువగా ఉన్నాయని వారు తెలిపారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో క్యాన్సర్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్, అధ్యయనం సహ రచయిత మార్క్ ఎల్‌వుడ్, ఈ అధ్యయనం ప్రధాన ప్రశ్నలలో ఏదీ ప్రమాదంలో పెరుగుదలను చూపించలేదని చెప్పారు. పెద్దలు, పిల్లలలో మెదడు క్యాన్సర్‌తో పాటు పిట్యూటరీ గ్రంథి, లాలాజల గ్రంథులు, లుకేమియా క్యాన్సర్‌లతో సహా మొబైల్ ఫోన్ వినియోగం, బేస్ స్టేషన్‌లు లేదా ట్రాన్స్‌మిటర్‌లకు సంబంధించిన ప్రమాదాలను కూడా సమీక్ష అంచనా వేసింది. మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల మానవ ఆరోగ్యానికి ముప్పు వాటిపై మరింత విస్తృతమైన పరిశోధనలు జరగాలని నిపుణులు సిఫార్సు చేశారు.
Read Also:Sheikh Hasina : కష్టాల్లో కూరుకుపోయిన షేక్ హసీనా… బంగ్లాదేశ్‌లో మరో రెండు కేసులు
IARC ప్రకారం, ఇది క్యాన్సర్ కారకం!
ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) ప్రస్తుతం మొబైల్ ఫోన్ రేడియేషన్‌ను ‘క్లాస్ 2B’గా పేర్కొంది. అంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని కొందరు నిపుణులు అంటున్నారు. అయితే, IARC దీనిని చివరిగా 2011లో అంచనా వేసిందని, ఆ తర్వాత జరిగిన అనేక స్టడీలను పరిశీలించి ఈ అంశాన్ని రీఅసెస్మెంట్ చేసి, జాబితాను రీక్లాసిఫై చేయాలని మరికొందరు సూచిస్తున్నారు.