Eating on Banana Leaves: మన భారతీయ సంస్కృతిలో అరిటాకులో భోజనం చేయడం అనేది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల్లో అరిటాకులో వడ్డించిన భోజనానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఇది కేవలం ఆచారం మాత్రమే కాదని, దాని వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ విశేషాలేంటో ఒకసారి చూసేద్దామా..
అరిటాకులో సహజంగా పాలిఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. వేడి ఆహారాన్ని అరిటాకులో వడ్డించినప్పుడు ఈ పాలిఫెనాల్స్ ఆహారంతో కలిసే అవకాశం ఉంటుంది. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే అరిటాకు మీద ఉండే సహజ కొవ్వు పొర వల్ల ఆహారానికి ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తాయి. వేడి అన్నం, పప్పు, కూరలు అరిటాకులో వడ్డించినప్పుడు ఆ ఆహారానికి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ వస్తుంది. అందుకే చాలా మంది అరిటాకులో భోజనం చేస్తే ఆహారం మరింత రుచిగా అనిపిస్తుందని చెబుతుంటారు.
ప్లాస్టిక్ ప్లేట్లు, థర్మకోల్ పాత్రలతో పోలిస్తే అరిటాకు పూర్తిగా సహజసిద్ధమైనది. ఇది పూర్తిగా బయోడిగ్రేడబుల్ కావడంతో పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు. వాడిన తర్వాత సులభంగా నేలలో కలిసిపోతుంది. అందుకే అరిటాకును “ఎకో ఫ్రెండ్లీ ప్లేట్”గా కూడా పిలుస్తున్నారు. అరిటాకులో ఉండే కొన్ని సహజ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయని, ముఖ్యంగా సంప్రదాయ ఆహారంతో కలిసి తీసుకున్నప్పుడు కడుపుకు తేలికగా ఉండటంతో పాటు జీర్ణ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. అరిటాకులో సహజసిద్ధమైన యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీంతో ఆహారంపై హానికర బ్యాక్టీరియా పెరగకుండా కొంతవరకు సహాయపడే అవకాశం ఉంటుంది.
