NTV Telugu Site icon

Flights theft: 200 ఫ్లైట్‌లు ఎక్కాడు.. లక్షల్లో దోచేశాడు.. ఘరానా దొంగ ఎలా దొరికాడంటే..!

Dkeke

Dkeke

మనం ఎక్కువగా ఇళ్లల్లో దొంగతనాలు.. లేదంటే చైన్‌స్నాచింగ్‌లు.. ఇంకా లేదంటే దారి దోపిడీలు చూసుంటాం. వినుంటాం. కానీ ఓ కేటుగాడు ఏకంగా ఆకాశంలో తిరిగే విమానాలను టార్గెట్ చేసుకున్నాడు. సహజంగా విమానాల్లో బాగా ధనవంతులు, లేదంటే ఆయా రకాలైన వీఐపీలు ప్రయాణం చేస్తుంటారు. చిన్న చిన్న దోపిడీలతో ఉపయోగం లేదనుకున్నాడో.. ఏమో తెలియదు గానీ.. ఏకంగా విమానాల్లో చోరీలకు పాల్పడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇలా లక్షల్లో దోచుకున్నాడు. కానీ పాపం పండి ఖాకీలకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

రాజేష్ కపూర్ అనే వ్యక్తిని ఏకంగా 110 రోజుల్లో 200 విమానాలు ఎక్కాడు. అలా ప్రయాణాలు చేస్తూ లక్షల విలువైన ఆభరణాలను దొంగిలించాడు. అయితే గత నెలలో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ. 7 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయని చెప్పడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై సీసీకెమెరాలను జల్లెడ పట్టగా కొత్త తరహా చోరీని ఛేదించారు. మొత్తానికి రాజేష్ కపూర్ అనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు చేసిన నేరాలను పోలీసులు కక్కించారు. నిందితుడికి ఢిల్లీ పహర్‌గంజ్‌లోని రికీ డీలక్స్ అనే గెస్ట్‌హౌస్ ఉండడం విశేషం.

రాజేష్.. గత సంవత్సరం 200 విమానాలు ఎక్కినట్లుగా గుర్తించారు. 2023లో అనేక మంది ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులను దొంగిలించాడు. విమానాశ్రయాల్లో దోపిడీలు చేసేందుకు అతడు 100 రోజుల పాటు దేశంలో వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. అయితే గత నెలలో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ. 7 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయని చెప్పడంతో ఢిల్లీ పోలీసులు ఈ చోరీని ఛేదించారు. అలాగే తన క్యాబిన్ బ్యాగ్ నుంచి రూ. 20 లక్షల విలువైన వస్తువులు దొంగిలించబడ్డాయని యూఎస్ నుంచి వచ్చిన మరో వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తానికి పోలీసులు రంగంలోకి దిగి కొన్ని గంటల ఫుటేజీని స్కాన్ చేయగా.. రాజేష్ కపూర్ భండారం బయటపడింది. అనంతరం కేటుగాడ్ని అరెస్టు చేశారు.

నిందితుడు వృద్ధులు, మహిళా ప్రయాణీకులను లక్ష్యంగా ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు. విమానాశ్రయంలో బాధితుల ప్రవర్తనను గమనించేవాడని సీనియర్ పోలీసు చెప్పాడు. బ్యాగ్‌లోని విలువైన వస్తువుల గురించి వారిని అనుసరించేవాడన్నారు. బ్యాగేజీ డిక్లరేషన్ స్లిప్‌లోని సమాచారాన్ని తెలివిగా చదివాడని చెప్పారు. ఇక బోర్డింగ్ గేట్ దగ్గర ఎక్కువగా సంభాషించడాన్ని చూసినట్లు పోలీసులు చెప్పారు.

కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో ప్రయాణించే ప్రయాణికులను రాజేష్ లక్ష్యంగా చేసుకున్నాడని ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఉషా రంగరాణి తెలిపారు. ఏప్రిల్‌లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న మహిళ ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయం నుంచి యూఎస్‌కి కనెక్టింగ్ ఎయిర్ ఇండియా విమానం ఎక్కవలసి వచ్చింది. అదే విధంగా యూఎస్ నివాసి వర్జిందర్‌జిత్ సింగ్.. అమృత్‌సర్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు ప్రయాణిస్తున్నాడు. ఢిల్లీ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్‌ ఎక్కినప్పుడు చోరీ జరిగిందని వెల్లడించారు. నిందితుడు ప్రయాణికుల పక్కనే ఉండేలా సీటు మార్చాల్సిందిగా విమానయాన సంస్థను కోరేవాడని పోలీసులు తెలిపారు.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఢిల్లీ పహర్‌గంజ్‌లో రాజేష్‌కి రికీ డీలక్స్ అనే అతిథి గృహం ఉందని తెలిపారు. గెస్ట్ హౌస్ మూడవ అంతస్తులో నిందితుడు నివసించాడని.. ఇతర అంతస్తులు వినియోగదారుల కోసం వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే వడ్డీ వ్యాపారం చేస్తాడని.. అంతేకాకుండా ఢిల్లీలో మొబైల్ రిపేర్ షాప్ కూడా ఉందని పోలీసులు తెలిపారు.