Site icon NTV Telugu

Asia Record: 24 గంటల్లో 87 లీటర్ల పాలు ఇచ్చిన గోమాత!

Haryana Cow

Haryana Cow

Asia Record: మాములుగా ఎక్కడైనా ఒక ఆవు రోజుకి 5 నుంచి 10 లీటర్ల వరకు పాలు ఇస్తుందన్న విషయం అందిరి తెలిసిందే. కానీ, మరికొన్ని జాతుల ఆవులు ఏకంగా 20 లీటర్లకు పైగా పాలను ఇవ్వగలవు కూడా. కాకపోతే ఇప్పుడు, హరియాణాకు చెందిన ఓ ఆవు ఏకంగా 24 గంటల వ్యవధిలో 87.7 లీటర్ల పాలను ఇచ్చి అద్భుత రికార్డును నెలకొల్పింది. దీనితో ఆ ఆవు ఆసియాలోనే ఒకే ఒక్క రోజులో ఎక్కువ పాలు ఇచ్చిన గోవుగా రికార్డ్ సాధించింది.

Read Also: Uttam Kumar Reddy: ఇంత సైంటిఫిక్గా కుల గణన ఎప్పుడూ జరగలేదు..

ఇక ఈ ఆవు విషయానికి వస్తే.. హరియాణాలోని కర్నాల్ జిల్లాకు చెందిన ఝిఝారీ గ్రామంలో సునీల్, శాంకీ అనే ఇద్దరు సోదరులు దీనిని పెంచుతున్నారు. వీరు తమ గోశాలలో ఉన్న ఆవులను పాడి పరిశ్రమకు కోసం పోషిస్తున్నారు. అయితే, తాజాగా కర్నాల్‌ లోని నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NDRI) ఓ మేళాను నిర్వహించింది. అక్కడికి వీరు తమ ఆవును తీసుకువెళ్లారు. అక్కడ జరిగిన పోటీలలో దేశవ్యాప్తంగా పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ పోటీలో భాగంగా.. సునీల్, శాంకీ గోశాలలో పెంచిన హోల్‌ స్టెయిన్ ఫ్రైసియన్ జాతికి చెందిన “సోనీ” అనే ఆవు కేవలం ఒకరోజు (24 గంటల) వ్యవధిలో సుమారు 88 లీటర్ల పాలు ఇచ్చి కొత్త రికార్డును సృష్టించింది.

ఇంతటి రికార్డును సాధించడంలో గోవుకు ఇచ్చే ప్రత్యేకమైన పోషణ కూడా ముఖ్య పాత్ర పోషించింది. ఈ సంద్రాభంగా గోవు యజమాని సునీల్ మాట్లాడుతూ.. మా కుటుంబం పశుపోషణను చాలా ఏళ్లుగా చేస్తోందని, 2014 నుండి రెండు పాడి పరిశ్రమలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మా గోశాలలో 195 ఆవులున్నాయని, వాటికి ప్రత్యేకంగా ఆహారం అందించటం వల్లనే అధిక పాలు ఉత్పత్తి అవుతున్నాయని పేర్కొన్నారు. ఇకపోతే రికార్డ్ సాధించిన సోనీకి ఇచ్చే ఆహారం విషయానికి వస్తే.. ఆ అవుకు రోజుకి 20 కిలోల ప్రత్యేక దాణా, 24 కిలోల సైలేజ్, 1.5 కేజీల గడ్డి, 10 కిలోల పచ్చి మేత అందంచనున్నట్లు తెలిపారు. ఇక వేసవి కాలంలో కూడా గోశాలలో ఉన్న ఆవుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. మంచి నీటి వసతి, ఆహారపదార్థాల సరఫరా, గోవుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్లే ఇది సాధ్యమైందంటూ అతను చెప్పుకొచ్చారు. మా గోశాల నుండి కొంత భాగం పాలు నెస్లే కంపెనీకి సరఫరా చేస్తామని, మిగతా వాటిని స్థానిక వినియోగదారులకు అందిస్తామని తెలిపారు.

Exit mobile version