Harmanpreet Kaur Injury: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తయిన భారత్.. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం అందుకుంది. కివీస్ చేతిలో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న హర్మన్ సేన.. పాక్‌పై గెలుపుతో ఆశలను సజీవంగా ఉంచుకుంది. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి సంచలన బౌలింగ్‌తో (3/19) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే భారత్ విజయానికి మరో రెండు పరుగులు కావాల్సిన సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఇంతకీ హర్మన్‌కు ఏమందంటే?.
టీమిండియా విజయానికి 9 బంతుల్లో 2 పరుగులే అవసరం అయ్యాయి. 19వ ఓవర్ నిదా దార్ వేసింది. నాలుగో బంతికి క్రీజు వదిలి బయటికి వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్.. భారీ షాట్ ఆడి మ్యాచ్‌ను ముగించాలని చూసింది. కానీ బంతి మిస్ అయింది. పాకిస్తాన్ వికెట్ కీపర్ మునీబా బంతిని సరిగా అందుకుని ఉంటే.. హర్మన్ స్టంపౌట్ అయ్యేది. మునీబా బంతిని వదిలేయడంతో.. హర్మన్ తిరిగి క్రీజును చేరుకోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో కాలిని క్రీజు వైపు చాచగా.. హర్మన్ పట్టు తప్పి పడిపోయింది. ఈ క్రమంలో ఆమె గాయపడింది. ఫిజియో వచ్చి చికిత్స అందించినా.. భారత కెప్టెన్ బ్యాటింగ్ కొనసాగించలేకపోయింది. మెడ నొప్పితో బాధపడుతూ పెవిలియన్‌కు చేరుకుంది.
మ్యాచ్ అనంతరం అవార్డ్స్ ప్రదానోత్సవానికి కూడా హర్మన్‌ప్రీత్ కౌర్ రాలేదు. స్మృతి మంధాన వచ్చి మాట్లాడింది. హర్మన్‌ప్రీత్ గాయం గురించి త్వరలోనే తెలియనుందని, వైద్యులు చికిత్స చేస్తున్నారని స్మృతి తెలిపింది. హర్మన్ బాగానే ఉందని తాను అనుకుంటున్నా అని పేర్కొంది. బుధవారం శ్రీలంకతో భారత్ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో హర్మన్ ఆడుతుందా? లేదా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. సెమీస్ చేరాలంటే భారత్ లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. కీలక సమయంలో హర్మన్ జట్టుకు దూరమైతే టీమిండియాకు ఎదురుదెబ్బే అని చెప్పాలి.