ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించి రిటెన్షన్ లిస్ట్ సమర్పించేందుకు ప్రాంచైజీలకు అక్టోబర్ 31 తుది గడువు. ఒక్కో ఫ్రాంఛైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఐపీఎల్ పాలకవర్గం అనుమతించి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వదిలేస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ విషయమై చర్చనీయాంశంగా మారింది.
హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసినప్పటి నుంచి ముంబై ఫ్రాంఛైజీకి, రోహిత్ శర్మకు మధ్య గ్యాప్ వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. హిట్‌మ్యాన్ ముంబైని వీడాలని నిర్ణయించుకున్నాడని, మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకుంటాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. రోహిత్ భవితవ్యం గురించి మాట్లాడాడు. ఒకవేళ రోహిత్ వేలంలోకి వస్తే ఆక్షన్ ఆసక్తికరంగా మారుతుందన్నాడు. వేలంలోకి వస్తే కచ్చితంగా భారీ ధర పలుకుతాడని హర్భజన్ పేర్కొన్నాడు.
‘రోహిత్ శర్మను ముంబై రిటైన్ చేసుకుంటుందా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హిట్‌మ్యాన్ వేలంలోకి వస్తే.. అతడి కోసం ఏ జట్టు బిడ్ వేస్తుందో చూడటానికి చాలా ఆతృతగా ఉంటుంది. చాలా ఫ్రాంఛైజీలు హిట్‌మ్యాన్‌ను దక్కించుకోవాలని చూస్తున్నాయి. రోహిత్ మంచి కెప్టెన్, ఆటగాడు. ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. రోహిత్‌కు ప్రస్తుతం 37 ఏళ్లు అయినా అతడిలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉంది. రోహిత్ వేలంలోకి వస్తే కచ్చితంగా భారీ ధర పలుకుతాడు’ అని హర్భజన్ సింగ్ చెప్పాడు. 2011 నుంచి ముంబైకి ఆడుతున్న రోహిత్.. 2013లో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. 2023 వరకు సారథిగా ఐదు ట్రోఫీలు అందించాడు.